My title

టిటిడిపికి మ‌రో షాక్‌

తెలంగాణ తెలుగుదేశానికి మరో షాక్ తగ‌ల‌బోతుంది. మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బోడ జనార్దన్‌ కాంగ్రెస్‌లో చేర‌బోతున్నారు. తెలంగాణ‌లో తెలుగుదేశం ప‌రిస్థితి రోజురోజుకు దిగ‌జారుతుండ‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరిక‌పై అనుచ‌రులు,కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న మంత‌నాలు జ‌రుపుతున్నారు. కాంగ్రెస్‌లో చేరితే చెన్నూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్‌ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం అంగీకరించినట్లు తెలిసింది. ఆయన అనుచరులు కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలోనే ఆయన హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు.బోడ జనార్దన్‌ గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.బోడ జనార్దన్‌ గతంలోనూ కాంగ్రెస్‌ పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. టీఆర్‌ఎస్‌లోకి కూడా వెళ్లినట్లే వెళ్లి తిరిగి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.  ఆత‌ర్వాత ఆపార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌కు ప్రధానపోటీ ఇచ్చేది కాంగ్రెస్సేనని భావించిన బోడ ఆ పార్టీలో చేరేందుకు నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. వ‌చ్చే ఆరునెల‌ల్లో బోడ జ‌నార్ధ‌న్ బాట‌లోనే మిగిలిన టీడీపీ నేత‌లు న‌డిచే ప‌రిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ‌లో టీడీపీ ఖాళీ అయ్యే ప‌రిస్థితి మాత్రం ద‌గ్గ‌ర‌ప‌డింది.