My title

బిచ్చగాడు సినిమాలాంటి కథ హైదరాబాద్‌లో జరిగింది….

మనలో చాలామందిమి బిచ్చగాడు సినిమా చూశాం. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యంకోసం ఒక నెలరోజులపాటు తనెవరో చెప్పకుండా బిచ్చగాడుగా అజ్ఞాతవాసం చేసిన కథ. సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన సినిమా ఇది. అలాంటి కథే హైదరాబాద్‌లో నిజంగా జరిగింది. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ఘనశ్యామ్‌ గురించి మనందరికీ తెలుసు. ఆయన ప్రతిఏడాది దీపావళి సందర్భంగా తన దగ్గర పనిచేసేవాళ్లకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఒక ఏడాది తన దగ్గర పనిచేసేవారందరికి తలా ఒక కారు, మరో ఏడాది తలా ఒక ఇల్లు ఇలా ఉదారంగా సాయం చేయడం ద్వారా దేశం దృష్టిని ఆకర్షించాడు.

ఆయన కొడుకు హితార్ధ్‌ కుటుంబ సంస్థలకు యజమానిగా మారేముందు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో తన ఐడెంటిటీని గుజరాత్‌లో వదిలేసి జేబులో సెల్‌ఫోన్‌ కూడా లేకుండా కేవలం 500ల రూపాయలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. వెయిటర్‌గా, దినసరి కూలీగా, హమాలీగా అతి చిన్న ఉద్యోగాలూ చేశాడు. తనకు వచ్చిన అతితక్కువ సంపాదనతో ఇరుకు గదిలో గడిపాడు. అలా నెలరోజులు గడిపిన హితార్ధ్‌ నిన్న (శుక్రవారం) హైదరాబాద్‌ తాజ్‌డెక్కన్‌ హోటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. నెలరోజులు ఇలా గడపడం వల్ల మానవసంబంధాలను అర్థం చేసుకున్నానని అన్నాడు. తమ కంపెనీలో పనిచేసే కార్మికుల పట్ల ఎలా ఉండాలో తెలుసుకోగలిగానని చెప్పారు. ఈ అనుభవంతో ఒక మంచి మనిషిగా బ్రతికే అనుభవం సంపాదించానని చెప్పాడు.