My title

ఇరుకున‌ప‌డ్డ ఇమ్రాన్ ఖాన్‌

పాకిస్తాన్ ప్ర‌ముఖ క్రికెట‌ర్‌, రాజ‌కీయ నేత అయిన ఇమ్రాన్ ఖాన్ ఇరుకున ప‌డ్డాడు. పాకిస్తాన్ ఎన్నిక‌ల సంఘంపై అత‌ను చేసిన వ్యాఖ్య‌లు వివాదంగా మారాయి. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ త‌మ‌పై ప‌క్ష‌పాతం చూపుతోంద‌ని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌ను క‌మిష‌న్ సీరియ‌స్‌గా తీసుకుంది.

త‌మ ముందు వ్య‌క్తిగతంగా హాజ‌రు కావాల‌ని ఎన్నిక‌ల సంఘం చేసిన ఆదేశాల‌ను ఇమ్రాన్ ఖాన్ ఖాత‌రు చేయ‌లేదు. క‌మిష‌న్ ముందు హాజ‌రు కాలేదు. దీంతో ఎన్నిక‌ల సంఘం ఖాన్‌పై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన క‌మీష‌న‌ర్ల బెంచ్ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్య‌ల‌ను విచారించింది. ఈ నెల 26న విచార‌ణ క‌మిటీ ఎదుట హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.

పొగ‌బెట్టిన పాత మిత్రుడు

ఇమ్రాన్ ఖాన్‌తో ఎంతో స‌న్నిహితంగా ఉంటూ వ‌చ్చిన అక్బ‌ర్ ఎస్ బాబ‌ర్ ఇమ్రాన్‌ఖాన్‌పై ఈసీకి ఫిర్యాదు చేశాడు. ఖాన్ స్థాపించిన పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్‌సాఫ్ (పిటిఐ) పార్టీలో చాలా చురుగ్గా ఉన్న బాబ‌ర్ 2011లో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు.

పిటిఐలో అంత‌ర్గ‌త అవినీతి, విదేశీ విరాళాల‌పై వివ‌ర‌ణ కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌తో బాబ‌ర్ విభేదించాడు. అక్క‌డి నుంచి ఇమ్రాన్‌ను వీలైన‌ప్పుడ‌ల్లా టార్గెట్ చేస్తున్నాడు. తాజాగా ఇమ్రాన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ కావ‌డానికి కూడా ఒక విధంగా బాబ‌రే ప్ర‌ధాన కార‌ణం.