My title

ఏపీపై అనుమానపు చూపులు…. బిల్లుకు నో చెప్పిన కేంద్రం

ఏపీ భూసేకరణ బిల్లుకు కేంద్రం నో చెప్పింది. అభివృద్ది పనుల పేరిట భారీగా వ్యవసాయ భూములను సేకరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దం చేసిన బిల్లుపై కేంద్ర వ్యవసాయ శాఖ అభ్యంతరాలు తెలిపింది. ఏపీ ప్రభుత్వం చెప్పిన విషయాలపై అనుమానం వ్యక్తం చేసిన కేంద్ర వ్యవసాయశాఖ ఆధారాలు చూపించాల్సిందిగా స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం రైతులకు ఎంతో భరోసాగా నిలిచింది. అదే సమయంలో రైతుల భూములు ప్రభుత్వాలు లాక్కోవడం చాలా కష్టమైపోయింది.

ఈనేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చట్టాలు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశాయి. ఇప్పటికే గుజరాత్, తెలంగాణ ప్రభుత్వాలు పంపిన భూసేకరణ బిల్లులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వచ్చేసరికి మాత్రం క్షుణ్ణంగా పరిశీలించాలని కేంద్రం నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ బిల్లు ఆమోదం పొందితే రైతులు భారీగా నష్టపోతారని… దీనిపై క్షుణ్ణంగా పరిశీలన జరపాలంటూ గతంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కోరారు. దాంతో ఆయన బిల్లును కేంద్ర హోంశాఖకు పంపించారు.  హోంశాఖ దాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ది, వ్యవసాయ శాఖకు  పంపించింది.

బిల్లును పరిశీలించిన కేంద్ర వ్యవసాయ శాఖ బిల్లులో తీవ్రస్థాయిలో లొసుగులు ఉన్న మాట నిజమేనని నిర్ధారించుకుంది. ఈ చట్టం ప్రకారం పంటలు పండే భూములను తీసుకోవడం సరికాదని…. దీని వల్ల ఆహారభద్రతకు ముప్పు కూడా ముంచుకొస్తుందని అభ్యంతరం తెలిపింది. అయితే ఇందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం…. రైతుల నుంచి పంటలు పండే భూములు తీసుకున్నా నష్టం ఉండదని, ఆహారభద్రతకు ముప్పు ఉండదని, తాము కొత్తగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల వల్ల 12లక్షల హెక్టార్ట భూమి కొత్తగా సాగులోకి వస్తుందంటూ సమాధానం పంపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ మాటలను నమ్మేందుకు ససేమిరా అన్న కేంద్ర వ్యవసాయశాఖ…. కొత్తగా ఆ 12 లక్షల హెక్టార్లు ఎక్కడ సాగులోకి వస్తోందో పూర్తి వివరాలు పంపాలంటూ ఈనెల 3న ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ లేఖ రాసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇబ్బందిలో పడింది.

కొత్తగా 12లక్షల హెక్టార్లు ఎక్కడ చూపించాలని మల్లగుల్లాలు పడుతోంది. ఆ వివరాలను పంపడం కష్టమని తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం…. అసలు గుజరాత్, తెలంగాణ బిల్లులను ఆమోదించి కేవలం తమ విషయంలో ఎందుకు ఇలా మొండిగా వ్యవహరిస్తున్నారంటూ వ్యవసాయ శాఖను నిలదీసింది. ఇందుకు స్పందించిన వ్యవసాయశాఖ…. గుజరాత్, తెలంగాణలకు చెందిన బిల్లులను కేంద్ర హోంశాఖ తమకు పంపలేదని…. కాబట్టి వాటి గురించి తమకు తెలియదని స్పష్టం చేసింది. ఇప్పటికే రాజధాని పేరుతో మూడు పంటలు పండే 33వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకున్న ఏపీ ప్రభుత్వ వైఖరిని గమనించిన తర్వాతే  కేంద్రం ఏపీ విషయంలో కాస్త కఠినంగా ఉందని చెబుతున్నారు