My title

బాబుకు ప్రేమతో… పచ్చ కమలం వింత రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తీరు మరోసారి చర్చనీయాంశమైంది. చంద్రబాబు బాగుకోసం ఏమీ చేసేందుకైనా ఏపీ బీజేపీలోని ఒక వర్గం నేతలు వెనుకాడరన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. ఇప్పుడు నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆ విషయం మరోసారి తేటతెల్లమవుతోంది. బాబు అవసరాలు తీరిన తర్వాత తమ అవసరాలు అన్నట్టుగా ఏపీ బీజేపీ నడుస్తోంది. నంద్యాలలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండడంతో బీజేపీని కలుపుకుని పనిచేస్తే ఆ ఓట్లు పోతాయని చంద్రబాబు భావించారు. ఆయన అనుకున్నదే ఆలస్యం అన్నట్టు ఏపీ బీజేపీ కూడా నంద్యాల వైపు కన్నెత్తి చూడలేదు.

చంద్రబాబు బీజేపీని నంద్యాలలో అంటరాని పార్టీగా మార్చినా బీజేపీ అస్సలు ఫీల్ కాలేదు. ఇలా అయితే సొంతంగా పోటీ చేస్తామని మాట వరుసకు కూడా హెచ్చరించలేదు. అయితే కాకినాడకు వచ్చే సరికి మాత్రం కమలం మరోలా రాజకీయం నడుపుతోంది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 డివిజన్లలో తమకు 26 ఇవ్వాల్సిందేనంటోంది. అందుకు టీడీపీ అంగీకరించకపోవడంతో ఏకంగా 26 డివిజిన్లలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. కాకినాడలో టీడీపీతో పొత్తు కోసం పోట్లాడుతున్న బీజేపీ.. మరి నంద్యాలలో ఎందుకు ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించడం లేదన్నది ఇప్పుడు ప్రశ్న.

నంద్యాలలో టీడీపీ ఓడిపోతే చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందులు తప్పవనే బీజేపీలోని ఒక వర్గం అక్కడ పట్టు విడుపు ప్రదర్శించిందని చెబుతున్నారు. బీజేపీతో చంద్రబాబు కలిసి పనిచేస్తున్న అంశాన్ని దాచి నంద్యాలలో ముస్లిం ఓట్లు వేయించుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నానికి ఏపీ బీజేపీ నేతలు తమ శక్తిమేర సాయం చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో బీజేపీకి నేతలు లేరా అంటే గట్టినాయకులే ఉన్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నారు. పైగా రాయలసీమలో పాగా వేస్తామంటూ ఆ మధ్య నేతలు సీమలో సభలు కూడా పెట్టారు. కానీ ఇప్పుడు తీరా నంద్యాల ఉప ఎన్నికలో మాత్రం బాబు కోసం పార్టీ ఉనికికి ముసుగు కప్పేశారు కమలనాథులు.