My title

అమరావతికి ప్రమాదం – టీడీపీ పత్రిక ఆశ్చర్యకరమైన కథనం

అమరావతి ప్రాంతంలో రాజధాని ఎంపికపై తొలినుంచి మేధావులు, శాస్త్రవేత్తలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా  ప్రస్తుత రాజధాని ప్రాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.  మూడు పంటలు పండే భూములుండడం, ప్రాంతాల మధ్య సమతుల్యానికి ఈ ప్రాంతం దూరంగా ఉండడంతో అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దని సూచించింది. భారీ వర్షాలు వస్తే, కొండవీటి వాగు పొంగి రాజధాని ప్రాంతంలో ఐదారు అడుగుల వరకు నీరు ముంచేస్తుందని నిపుణులు హెచ్చరించారు. అయితే చంద్రబాబు ఆయన అనుకూల మీడియా మాత్రం అమరావతిని మించిన ప్రాంతం రాజధానికోసం లేదని వాదిస్తూ వచ్చింది. కానీ హఠాత్తుగా టీడీపీ అనుకూల పత్రిక శుక్రవారం రాజధాని ప్రాంతంపై ఒక భారీ నెగిటివ్ స్టోరీని ప్రచురించింది.

ప్రస్తుతం రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతానికి భూకంపాల ముప్పు ఉందని తొలి పేజీలోనే కథనాన్ని ప్రచురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల తరచూ రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు రావడాన్ని ప్రస్తావిస్తూ…. రాజధాని ప్రాంతంలో భారీ భవంతులు నిర్మించే అవకాశం ఉన్నందున భూప్రకంపనల ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాజధాని ప్రాంతానికి చెంతనే ఉన్న గన్నవరంలో గురువారం కొన్ని నిమిషాల పాటు భూప్రకంపనలు రావడం ప్రమాద సంకేతమేనని అభిప్రాయపడింది. 1993లో మహారాష్ట్రలోని లాతూరులో తీవ్ర స్దాయిలో భూకంపం వచ్చిన సమయంలో ఏర్పడిన భూమిలోపల పగుళ్లలో ఒక పెద్ద పగులు లాతూరు నుంచి హైదరాబాదు మీదుగా ఒంగోలు వరకు ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారని వెల్లడించింది. దాని ప్రభావంతోనే ఏపీలో కూడా భూప్రకంపనలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారని ఉటంకించింది.

 ప్రస్తుతం అమరావతి జోన్‌ -3లో ఉన్న అంశాన్ని ప్రస్తావించింది. టీడీపీ కోసం ఒక అడుగు ముందుకేసి అండగా నిలబడే సదరు పత్రిక హఠాత్తుగా అమరావతికి భూకంపాల ముప్పు ఉందని భారీ కథనాన్ని ప్రచురించడం ఆశ్చర్యంగానే ఉంది.  ఈకథనంలో నిజం ఉన్నా…. ఈ విషయాన్ని టీడీపీ పత్రిక ప్రచురించడం ఆశ్చర్యమే. అయితే ఈ కథనం వెనుక ఏమైనా కొత్త ఉద్దేశాలు ఉన్నాయా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సదరు పత్రిక ఇంత కథనం రాసి…. భూకంపాలను తట్టుకునే విధంగా భవనాలను నిర్మించాల్సి ఉందని…. ఆ తరహా టెక్నాలజీ వాడితే నిర్మాణ వ్యయం 20 శాతం అధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. బహుశా తాత్కాలిక సచివాయం నిర్మాణానికి రెట్టింపు సొమ్ము చెల్లించినట్టుగానే భూకంపాల టెక్నాలజీని సాకుగా చూపెట్టి కాంట్రాక్టర్లకు అధిక ప్రజాధనం కట్టబెట్టే ప్రయత్నం చేయకపోతే అదే చాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.