My title

రెండేళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ అక్కినేని అవార్డు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పేరిట నెల‌కొల్పిన అక్కినేని అవార్డును ఈ ఏడాది  డైరెక్ట‌ర్‌ రాజమౌళికి ఇవ్వ‌నున్నారు. ఈ విష‌యాన్ని  అవార్డు క‌మిటీ స‌భ్యులు అక్కినేని నాగార్జున ,సుబ్బ‌రామిరెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 17న శిల్పకళా వేదికలో జరిగే కార్య‌క్ర‌మంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఈ అవార్డును జ‌క్క‌న్న‌కు ఇవ్వ‌నున్నారు. అయితే ఈ అవార్డును గ‌త రెండేళ్లుగా ఎందుకివ్వ‌లేద‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  అక్కినేని త‌ను జీవించి ఉండ‌గానే త‌న పేరిట ఈ అవార్డు నెల‌కొల్పారు.  ఈ అవార్డు క‌మిటీలో త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు రామానాయుడు ఫ్యామిలీ, సుబ్బ‌రామిరెడ్డి కుటుంబ‌స‌భ్యులను మెంబ‌ర్స్‌గా చేర్చారు.

2006 నుంచి 2013 వ‌ర‌కు వ‌రుస‌గా అక్కినేని అవార్డులు ఇచ్చారు.  2014లో అక్కినేని మ‌ర‌ణించారు. అయితే ఆయ‌న చ‌నిపోక‌ముందే ఆ ఏడాది శ్రీదేవికి ఆ అవార్డు ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో ఆ ఏడాది త‌న నాన్న ప్ర‌క‌టించిన శ్రీదేవికి కాకుండా అమితాబ్ బ‌చ్చ‌న్‌కు నాగార్జున అవార్డు ఇచ్చారు. ఆ త‌ర్వాత 2015,16 సంవ‌త్స‌రాల‌కు అక్కినేని అవార్డు సంగ‌తినే వార‌సులు మ‌ర్చిపోయారు. ప్ర‌తి ఏడాది సెప్టెంబ‌ర్ 20న అక్కినేని జ‌యంతి సంద‌ర్బంగా ఈ అవార్డును బ‌హుక‌రిస్తామ‌ని నాగార్జున గ‌తంలో చెప్పాడు. కానీ రెండేళ్ల పాటు ఎవ‌రికీ అవార్డు ఇవ్వ‌క‌పోవ‌డంపై ఇప్పుడు విమ‌ర్శ‌లు చెల‌రేగుతూనే ఉన్నాయి. 

ఈ అవార్డు కోసం అక్కినేని త‌ను జీవించి ఉండ‌గానే కొంత మొత్తం డిపాజిట్ చేశారు. దానిమీద వ‌చ్చే వ‌డ్డీతోనే అవార్డు ఇచ్చే వారు. తాను చ‌నిపోయిన త‌ర్వాత కూడా త‌న వార‌సులు దీన్ని కొన‌సాగిస్తార‌ని అప్ప‌ట్లో ఆయ‌న చెప్పేవారు. అయితే వార‌సుల‌కు డ‌బ్బు ఇబ్బంది లేకుండా…. అన్నీ ఏర్పాట్లు చేసిపోయినా…. రెండేళ్ల పాటు ఈ అవార్డు ఎందుకివ్వ‌లేద‌నేది అక్కినేని అభిమానుల‌ను వేధిస్తోంది. అవార్డు ఎందుకివ్వ‌లేద‌నే దానిపై అక్కినేని వార‌సులే స‌మాధానం చెప్పాలి.