My title

ఆరుషి హత్య కేసులో ఊహించని తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో అలహాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా హత్య కేసులో ఆరుషి తల్లిదండ్రులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆరుషి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా సీబీఐ సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో దాస్పా జైల్లో ఉంటున్న ఆరుషి తల్లిదండ్రులకు ఊరట లభించింది. 2008, మే 16న తమ 14 ఏళ్ల కూతురు అయిన ఆరుషిని, నౌకరు హేమ్‌రాజ్‌ను ఆమె తల్లిదండ్రులు రాజేశ్, నూపుర్ గొంతుకోసి హతమార్చారని గతంలో సీబీఐ బలంగా వాదించింది.

కేసు దర్యాప్తు పోలీసుల నుంచి సీబీఐకి చేతికి వెళ్లడం, నౌకర్ల ప్రమేయంపై వార్తలు రావడం, తరచూ కీలక మలుపులు సంభవించడంతో దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆరుషి హేమ్‌రాజ్ ‘అభ్యంతరకర’ స్థితిలో కనిపించడాన్ని సహించలేక తల్లిదండ్రులే హతమార్చారని సీబీఐ వాదించింది. అయితే తమకు ఏ పాపం తెలియదని.. దర్యాప్తులో లోపాలు, మీడియా తప్పుడు కథనాల వల్ల తాము కేసులో చిక్కుకున్నామని ఆరుషి తల్లిదండ్రులు వాదిస్తూ వచ్చారు.

ఇదే సమయంలో తల్వార్ దంపతులు హత్యలు చేసినట్టు నిర్దారించేందుకు అవసరమైన ఫోరెన్సిక్, భౌతిక సాక్ష్యాలేవీ తమ వద్ద లేవని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఆరుషి, హేమరాజ్ మరణానికి ముందు తల్వార్ దంపతులతో కనిపించారు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చామన్న సీబీఐ వాదనతో గతంలో ప్రత్యేక కోర్టు ఏకీభవించింది. తల్వార్ దంపతులను గతంలో సీబీఐ కోర్టు దోషులుగా ప్రకటించింది. దీంతో వారు పైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. అలహాబాద్ కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో తల్వార్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆరుషిని హత్య చేసింది ఎవరన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.