My title

భ‌గ‌త్‌సింగ్ నిర్దోషి…. పాక్ లాయ‌ర్ న్యాయపోరాటం

తెల్లోడి గుండెల్లో దిగిన ఇండియ‌న్ బుల్లెట్ భ‌గ‌త్‌సింగ్‌…. భ‌ర‌త‌మాత స్వేచ్ఛ కోసం బ్రిటీష్‌వాడిపై తిరుగుబాటు చేసి ఉరితాడును ముద్దాడిన వీర‌బెబ్బులి ష‌హీద్ భ‌గ‌త్‌సింగ్‌… ఆయ‌న పేరు తెల్ల‌దొర‌ల‌కు సింహ‌స్వ‌ప్నం… భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం 23 ఏళ్ల ప్రాయంలోనే ప్రాణాలు అర్పించాడు… సైమ‌న్ క‌మిష‌న్ రాక‌ను వ్య‌తిరేకిస్తూ పంజాబ్ కేస‌రి లాలా ల‌జ‌ప‌తి రాయ్ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేశారు… ఆ స‌మ‌యంలో పోలీసులు లాఠీల‌తో అత్యంత అమానుషంగా కొట్ట‌డంతో భ‌గ‌త్‌సింగ్ క‌ళ్ల‌ముందే లాలా ల‌జ‌ప‌తిరాయ్ క‌న్నుమూశారు.. దీంతో లాలా ల‌జ‌ప‌తిరాయ్ హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి సుఖ్‌దేవ్‌, రాజ్‌గురుల‌తో క‌లిసి భ‌గ‌త్‌సింగ్ మెరుపుదాడి చేసి బ్రిటీష్ పోలీస్ అధికారి శాండ‌ర్స్‌ను కాల్చి చంపాడు. దీంతో నాటి తెల్ల‌దొర‌ల ప్ర‌భుత్వం భ‌గ‌త్‌సింగ్‌ను 1931, మార్చి 23న‌ ఉరి తీసింది.

ఆ ఉరిశిక్ష అమ‌లైన 86 ఏళ్ల‌కు భ‌గ‌త్‌సింగ్ నిర్దోషి అంటూ ఓ పాకిస్తానీ లాయ‌ర్ లాహోర్ కోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. భ‌గ‌త్‌సింగ్ మెమోరియ‌ల్ ఫౌండేష‌న్ న‌డుపుతున్న ఇంతియాజ్ ర‌షీద్ ఖురేషి అనే న్యాయ‌వాది సెప్టెంబ‌ర్ 11న లాహోర్ కోర్టులో ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు… భ‌గ‌త్‌సింగ్ నిర్దోషి అంటూ ఆయ‌న కొన్ని ఆధారాలు చూపుతున్నారు.

1928లో శాండ‌ర్స్ హ‌త్య‌కు గురికాగా అదే ఏడాది డిసెంబ‌ర్ 17న ఎఫ్ఐఆర్ న‌మోదైంది… లాహోర్‌లోని అనార్క‌లీ పోలీస్‌స్టేష‌న్‌లో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీల‌ను పోలీసులు 2014లో గుర్తించారు.. ఉర్దూలో రాసిన ఆ కాపీల‌ను ఖురేషి సంపాదించారు…. సాయుధుడైన గుర్తు తెలియ‌ని వ్య‌క్తి శాండ‌ర్స్‌ను హ‌త్య చేసిన‌ట్లు ఆ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. భ‌గ‌త్‌సింగ్ పేరును అందులో ప్ర‌స్తావించ‌లేదు… 450మంది సాక్షుల‌ను విచారించ‌కుండానే ఎఫ్ఐఆర్‌లో పేరు లేన‌ప్ప‌టికీ నాటి కోర్టు భ‌గ‌త్‌సింగ్‌కు ఉరిశిక్ష విధించింద‌ని ఖురేషి చెబుతున్నారు… ఈ కేసులో భ‌గ‌త్‌సింగ్ త‌ర‌ఫు లాయ‌ర్ల‌ వాద‌న‌ల‌ను తెల్ల‌వాడి కోర్టు విన‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు…తాను వేసిన పిటిష‌న్‌తోనైనా నాటి తెల్లోడి స‌ర్కార్ భ‌గ‌త్‌సింగ్‌ను ఎంత అ…న్యాయ‌బ‌ద్ధంగా చంపిందో ప్ర‌పంచానికి తేట‌తెల్లం అవుతుంద‌ని ఆయ‌న ఆశిస్తున్నారు.