My title

వంద రోజులైంది…. లెక్కలెందుకు చెప్పట్లేదు

బాహుబలి-2 సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవ్. విడుదలైన ప్రతి సెంటర్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా. ఓవర్సీస్ లో కూడా అద్భుతంగా ఆడేసింది. అలా సినిమా వంద రోజులు పూర్తిచేసుకుంది. అంతా బాగానే ఉంది కానీ, వంద రోజులైనా ఈ సినిమా సాధించిన వసూళ్లను మాత్రం అధికారికంగా చెప్పడం లేదు యూనిట్ సభ్యులు.

ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదలైంది. విడుదలైన రెండో రోజు నుంచే ఈ సినిమా వసూళ్లు చెప్పడం ప్రారంభించారు. అలా దాదాపు నెల రోజుల పాటు బాహుబలి-2 లెక్కలు చెప్పారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఈ సినిమాకు, నిర్మాతలకు కొమ్ముకాసిన ఓ సెక్షన్ మీడియా కూడా సైలెంట్ అయిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అసలింతకీ బాహుబలి-2 ఎంత కలెక్ట్ చేసింది? ఓ వైపు నంబర్ వన్ ఇండియన్ మూవీ అంటూ వాల్ పోస్టర్లు వేసుకుంటున్న యూనిట్.. ఆ నంబర్ వన్ స్థానాన్ని సాదించే క్రమంలో ఎంత కలెక్ట్ చేసిందనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. వసూళ్ల విషయంలో చాలా క్లారిటీగా ఉండే రాజమౌళి కూడా ఈసారి సైలెంట్ అయిపోవడం అనుమానాలకు తావిస్తోంది.