My title

త్వ‌ర‌లోనే కేంద్ర‌మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌…. తెలంగాణ నుంచి మ‌రొక‌రికి చోటు

కేంద్ర‌మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ  ఈ నెలాఖరు నాటికి జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. దీంతో పాటే బీజేపీలో సంస్థాగ‌త మార్పులు, గ‌వ‌ర్న‌ర్ల నియ‌మాకం ఉంటుంద‌ని తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల‌తో పాటు రాబోయే గుజ‌రాత్‌,మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కీల‌క మార్పులు చేస్తార‌ని తెలుస్తోంది.  దాదాపు 20 మంది వరకు సీనియర్‌, జూనియర్‌ మంత్రులకు శాఖలు మార్చడం లేదా ఉద్వాసన పలికే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ నుంచి మ‌రొక‌రికి మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే ద‌త్తాత్రేయ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. తెలంగాణలో పార్టీ బ‌లోపేతానికి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్‌రావును కేంద్ర‌మంత్రివ‌ర్గంలోకి తీసుకొవ‌చ్చ‌ని స‌మాచారం. ఒక‌వేళ ద‌త్తాత్రేయ‌ను ప‌క్క‌న‌పెట్టినా ఆశ్చ‌ర్య‌పోనక్క‌ర‌లేద‌ని కొంద‌రు చెబుతున్నారు. మొత్తానికి ముర‌ళీధ‌ర్‌రావుకు బెర్త్ ఖాయ‌మైంది. ఇటు క‌ర్నాట‌క‌,త‌మిళ‌నాడు రాష్ట్రాల ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయ‌న స్థానంలో రాంమాధ‌వ్‌ను నియ‌మిస్తార‌ని ఒక వార్త‌. మొత్తానికి ఈ ఇద్ద‌రు తెలుగు వ్య‌క్తుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్పగిస్తార‌ని క‌మ‌లం వ‌ర్గాల్లో ప్ర‌చారం న‌డుస్తోంది.

ఈ సారి కేంద్ర‌మంత్రివ‌ర్గంలోకి అన్నాడీఎంకే, జేడీయూ నేత‌ల‌కు చోటు క‌ల్పిస్తారు. మ‌రోవైపు తెలంగాణ, మధ్యప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, బిహార్‌, మేఘాలయ రాష్ట్రాలకు గవర్నర్లు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ను మార్చే అవకాశమూ ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ నెల‌లో కేంద్రంలో కీల‌క‌మార్పులు జ‌రిగే అవ‌కాశం క‌న్పిస్తోంది.