Telugu Global
Telangana

కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్.. కలకలం రేపుతున్న పోస్టర్లు

సీఎం సీటు చేజారిపోయిందని అనుకుంటున్న సీనియర్లు తెలంగాణ కాంగ్రెస్ లో చాలామందే ఉన్నారు. సందర్భానుసారం వారిలో కొందరు తమ మనసులో మాటల్ని బయటపెడుతుంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు.

కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్.. కలకలం రేపుతున్న పోస్టర్లు
X

"ఇప్పుడు మంత్రి.. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి" మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిమానులు బ్యానర్లు, పోస్టర్లు సిద్ధం చేశారు. అభిమానం ఉండొచ్చు కానీ, మరీ ఈ స్థాయిలో ఉంటుందని కాంగ్రెస్ నేతలు కూడా ఊహించలేదు. పోనీ ఈ వ్యవహారం ఉత్తమ్ కి కానీ, ఆయన దగ్గరి అనుచరులకు కానీ తెలియకుండా ఉంటుందా అంటే అనుమానమే. ఉత్తమ్ వర్గం అనుమతి లేకుండా ఈ పోస్టర్లు బయటకు వచ్చాయనుకోలేం. సీఎం పోస్టుకే ఎసరు పెట్టేలా ఉన్న ఈ పోస్టర్లు ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలకు ఆజ్యం పోసేలా ఉన్నాయి.

ఎన్నికలకు ముందు, తర్వాత సీఎం పోస్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం సీటుని అధిష్టానం రేవంత్ రెడ్డికి ఖరారు చేయడంతో ఉత్తమ్ మంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. ఆయనలో అసంతృప్తి పూర్తిగా తొలగిపోయిందని అనుకోలేం. ఆ మాటకొస్తే సీఎం సీటు తమకు చేజారిపోయిందని అనుకుంటున్న సీనియర్లు తెలంగాణ కాంగ్రెస్ లో చాలామందే ఉన్నారు. సందర్భానుసారం వారిలో కొందరు తమ మనసులో మాటల్ని బయటపెడుతుంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల లోపే ఉత్తమ్ భవిష్యత్ సీఎం అంటూ వెలసిన పోస్టర్లు మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేకపోయినా.. మెజార్టీ అంతంతమాత్రమే కాబట్టి ఏ ఒక్కరూ అలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉంది. ప్రభుత్వం కొలువుదీరే సమయంలోనే పదవుల పంపకాలపై కాస్త గడబిడ ఏర్పడింది. సీఎం చైర్ రేవంత్ రెడ్డికి ఏకపక్షం అయినా ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలోనే సుదీర్ఘ చర్చ నడిచింది. మిగతా సీనియర్లు కూడా ప్రస్తుతానికి మంత్రి పదవులతో సరిపెట్టుకున్నారు. వారంతా అధిష్టానానికి బద్ధులే అయినా సీఎం రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇస్తారని అనుకోలేం. ఏక్ నాథ్ షిండేలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే మాత్రం కాంగ్రెస్ కి తెలంగాణలో కష్టాలు తప్పవు.

First Published:  9 Feb 2024 4:28 AM GMT
Next Story