Telugu Global
Telangana

ఈ సమయంలో పొలిటికల్ డ్రామాలు ఎందుకు? మంత్రి తలసాని వ్యాఖ్యలు

కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న గద్దర్ మరణంతో.. అందరూ భాధగా ఉంటే.. నిన్నటి నుంచి పొలిటికల్ డ్రామాలు నడుస్తున్నాయని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమయంలో పొలిటికల్ డ్రామాలు ఎందుకు? మంత్రి తలసాని వ్యాఖ్యలు
X

ప్రజా గాయకుడు గద్దర్ మృతిని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా మండి పడ్డారు. ఇలాంటి సమయంలో పొలిటికల్ డ్రామాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గద్దర్ హఠాన్మరణం తీరని లోటని, ఆయన తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేశారని మంత్రి తలసాని అన్నారు. గద్దర్ ఒక గొప్ప వ్యక్తి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండి కూడా.. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నారని మంత్రి చెప్పారు.

కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న గద్దర్ మరణంతో.. అందరూ భాధగా ఉంటే.. నిన్నటి నుంచి పొలిటికల్ డ్రామాలు నడుస్తున్నాయని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో చాలా గొప్పగా గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు.

కొంత మంది రాజకీయ నాయకులు అన్ని ఏర్పాట్లు తామే చేస్తున్నామని చెప్పుకుంటున్నారని.. ఎల్బీ స్టేడియంలో కూడా వాళ్లే ఏర్పాట్లు చేసుకున్నట్లు మీడియాకు చెప్పుకున్నారు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.

ఎల్బీ స్టేడియంలో గద్దర్ మృతదేహానికి నివాళులు అర్పించిన మంత్రి కిషన్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గద్దర్ అనుకున్న ఆశయాలు నెరవేరకుండానే ఆయన వెళ్లిపోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇబ్బందులు అలాగే ఉన్నట్లు గద్దర్ భావించారని చెప్పారు. అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ తనతో చెప్పినట్లు మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మరోవైపు ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లు రేవంత్ రెడ్డి చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కొంత మంది కావాలనే ఇలాంటి తప్పుడు లీకులు మీడియాకు ఇచ్చినట్లు తెలుస్తున్నది. గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వమే దగ్గర ఉండి ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

First Published:  7 Aug 2023 11:17 AM GMT
Next Story