Telugu Global
Telangana

సీనియర్ల బ్లాక్‌ మెయిలింగ్‌ను పట్టించుకోని రేవంత్ రెడ్డి.. ఆయన వెనుక ఉన్నది ఎవరు?

సీనియర్లు ఎన్ని మాటలు అంటున్నా, అతని నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నా.. రేవంత్ మాత్రం తన దూకుడు ఆపడం లేదు.

సీనియర్ల బ్లాక్‌ మెయిలింగ్‌ను పట్టించుకోని రేవంత్ రెడ్డి.. ఆయన వెనుక ఉన్నది ఎవరు?
X

కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా సీనియర్లు, వలస నాయకుల పేరుతో పెద్ద రాద్దాంతమే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు సాధారణమే అయినా.. ఈ సారి మాత్రం ఇది సరికొత్త రీతిలో జరుగుతుండటం గమనార్హం. గతంలో ఫలానా సామాజిక వర్గానికి లేదా ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ నాయకులు జట్టు కట్టే వాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం సీనియర్, జూనియర్ అనే పేరుతో గ్రూపులు కడుతున్నారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన దగ్గర నుంచి సీనియర్లు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మొదట్లో కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి వంటి వాళ్లు మాత్రమే బహిరంగంగా రేవంత్‌పై విమర్శలు చేశారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా రేవంత్ వ్యతిరేక కూటమికి నిన్న మొన్నటి వరకు అతడితో సన్నిహితంగా తిరిగిన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూపు కట్టడం గమనార్హం.

రేవంత్‌కు వ్యతిరేకంగా జట్టు కట్టిన వీరిద్దరితో పాటు మధుయాష్కీ, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహా వంటి సీనియర్లు కూడా ఉన్నారు. ఈ సారి రేవంత్‌తో తాడోపేడో తేల్చుకోవాలనే పట్టుదలతో వాళ్లు కనిపిస్తున్నారు. అసమ్మతి రాగం వినిపిస్తున్న సీనియర్లు మరోసారి మంగళవారం భేటీ కానున్నారు. ఆ తర్వాత తమ కార్యచరణ ప్రకటించే అవకాశం ఉన్నది. ఇటీవల గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ ఎక్స్‌టెండెడ్ ఎగ్జిక్యూటీవ్ కమిటీకి కూడా వీళ్లు హాజరు కాలేదు. రేవంత్‌కు అసలు సహకరించేది లేదని ఇప్పటికే కుండ బద్దలు కొట్టారు. టీడీపీ నుంచి వచ్చిన 50 మందికి పైగా నాయకులకు పీసీసీ కమిటీల్లో చోటు కల్పించారనేది సీనియర్ల ముఖ్యమైన ఆరోపణ. కానీ టీడీపీ నుంచి వచ్చిన వారిలో కేవలం 13 మందికి మాత్రమే పదవులు దక్కాయనే విషయం స్పష్టంగా తెలియాలని రేవంత్.. వారితో రాజీనామాలు చేయించారు. అయినా సరే సీనియర్లు, రేవంత్ మధ్య వివాదం సమసిపోలేదు.

సీనియర్లు ఎన్ని మాటలు అంటున్నా, అతని నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నా.. రేవంత్ మాత్రం తన దూకుడు ఆపడం లేదు. జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే రేవంత్ ఇంత ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటని అందరికీ అనుమానం కలుగుతోంది. అసమ్మతి నాయకులతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పెద్ద లాబీయింగ్ లేదు. అయినా సరే రేవంత్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా తన పని తాను చేసుకొని పోతున్నారు. రేవంత్ రెడ్డి ఈ స్థాయి ధీమాగా ఉండటానికి కారణం జానారెడ్డి అనే పార్టీలో చర్చ జరుగుతున్నది. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ అయిన జానారెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో సీఎల్పీ లీడర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయనే రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.

గత వారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టినా జానారెడ్డి మాత్రం హాజరయ్యారు. పైగా ప్రస్తుత సంక్షోభాన్ని 'టీ కప్పులో తుఫాను' అంటూ లైట్ తీసుకున్నారు. పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ కూడా జానారెడ్డి బాటలోనే రేవంత్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఢిల్లీలో ఏవైనా లాబీయింగ్ చేయాలంటే వీరి ముగ్గురు ఉంటే సరిపోతుందనే ధీమాతో రేవంత్ ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీని పదే పదే రేవంత్ కలిశారు. తెలంగాణలో యాత్ర జరిగినప్పుడు పూర్తిగా ఆయన వెంటే ఉన్నారు. అంతే కాకుండా, తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి రేవంత్ నివేదిక ఇస్తున్నట్లు తెలుస్తున్నది. పైగా, గత ఎన్నికల సమయంలో చంద్రబాబును రాహుల్‌ను కలిపిందే రేవంత్ రెడ్డి అనేది బహిరంగ రహస్యమే.

రాష్ట్రంలో జానారెడ్డి, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని చూసుకొని రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని.. పైగా టీడీపీ నుంచి వచ్చిన వారితో రాజీనామాలు చేయించి అధిష్టానం వద్ద తన తప్పు లేకుండా చూసుకున్నారనే చర్చ జరుగుతున్నది. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డితో కూడా రేవంత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ అతడికి కలసి వస్తున్నాయని అంటున్నారు. అందుకే సీనియర్లు ఎంత కయ్యానికి కాలుదువ్వుతున్నా.. రేవంత్ మాత్రం వారిని లైట్ తీసుకుంటున్నారని తెలుస్తున్నది. అంతగా తన పీసీసీ పదవికి ఎసరు వస్తే 'ప్లాన్ బి' కూడా రెడీ చేసి పెట్టుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ప్లాన్ బీ అంటే వేరే పార్టీలోకి జంప్ అవుతారా? లేదంటే కొత్త పార్టీ పెడతారా అనే విషయం మాత్రం తెలియడం లేదు.

First Published:  20 Dec 2022 2:27 AM GMT
Next Story