Telugu Global
Telangana

నెక్స్ట్ ఎవరు..? వివేక్ వెంకటస్వామి ఏమన్నారంటే..?

కోమటిరెడ్డి తర్వాత నెక్ట్స్ వికెట్ ఎవరు..? తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని అంచనా వేసిన సీనియర్ నాయకులు ఎవరు..? ఎవరెవరు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో కి వెళ్లబోతున్నారు..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

నెక్స్ట్ ఎవరు..? వివేక్ వెంకటస్వామి ఏమన్నారంటే..?
X

ఎన్నికల వేళ గోడదూకుళ్లు సహజమే. టికెట్ ఆశించి భంగపడినవారు పార్టీ ఫిరాయించి మరీ టికెట్ సాధించుకుంటారు. ఉన్న పార్టీపై నమ్మకం లేనివారు టికెట్ దొరికినా.. పక్క పార్టీలోకి జంప్ చేస్తుంటారు. తెలంగాణ ఎన్నికల వేళ వివిధ పార్టీల జాబితాలు విడుదలయ్యే సమయంలో టికెట్ దక్కని అసంతృప్తుల ఫిరాయింపుల పర్వం నడిచింది. ఇప్పుడు జాబితాలు ఖరారయ్యే సమయానికి పార్టీ నచ్చక గోడదూకేవారి సీజన్ మొదలైంది. బీజేపీలో అన్నీ అమరినా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీకి భవిష్యత్ లేదంటూ రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరుతున్న‌.. కోమటిరెడ్డి తర్వాత నెక్ట్స్ వికెట్ ఎవరు..? తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని అంచనా వేసిన సీనియర్ నాయకులు ఎవరు..? ఎవరెవరు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో కి వెళ్లబోతున్నారు..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తారంటూ బలంగా వినపడుతున్న పేరు వివేక్ వెంకట స్వామి. ఇది కూడా ఫ్యామిలీ మేటర్ కావడం విశేషం. కోమటిరెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి ఆల్రడీ కాంగ్రెస్ లో టికెట్ సాధించారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు. వెంకట స్వామి సోదరుడు వినోద్ పేరు కూడా కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో ఉంది. ఇప్పుడు వివేక్ వంతు వస్తుందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై వివేక్ ముందుగానే స్పందించారు. తాను పార్టీ మారట్లేదన్నారు. ఫిరాయింపు వార్తలు చాన్నాళ్లుగా వినపడుతున్నాయని చెప్పారాయన.

వివేక్ మాటలు నమ్మొచ్చా..?

పార్టీ మారే నాయకులెవరైనా ముందు రోజు వరకు అబ్బెబ్బే అవన్నీ వట్టి పుకార్లు అనే చెబుతారు. తాజాగా వివేక్ మాటలు కూడా అలాంటివేనంటున్నారు. రాజగోపాల్ రెడ్డి కాస్త ముందుగా బయటపడ్డారని, వివేక్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కానీ వివేక్ మాత్రం తానింకా బీజేపీ నేతలతోనే కలసి ఉంటున్నాను కదా అని కవర్ చేసుకుంటున్నారు. బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. బీజేపీని వీడేది లేదని స్పష్టం చేశారు. మీడియా మాత్రం వివేక్ శీలాన్ని ఇంకా శంకిస్తూనే ఉంది.


First Published:  25 Oct 2023 9:52 AM GMT
Next Story