Telugu Global
Telangana

బీజేపీకి మరో షాక్.. కాంగ్రెస్ లోకి విజయశాంతి

విజయశాంతి చేరికకు మహూర్తం ఎప్పుడు, ఎవరి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అనేది మరికొన్నిరోజుల్లో తెలుస్తుంది.

బీజేపీకి మరో షాక్.. కాంగ్రెస్ లోకి విజయశాంతి
X

బీజేపీకి మరో షాక్.. కాంగ్రెస్ లోకి విజయశాంతి

బీజేపీకి ఇది మరో షాకింగ్ న్యూస్. సినీనటి, సీనియర్ నాయకురాలు విజయశాంతి త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఇది ఊహాగానంలా ఉన్నా.. టీపీసీసీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్లు రవి ఈ విషయాన్ని ధృవీకరించడంతో అధికారికంగా మారింది. అయితే విజయశాంతి చేరికకు మహూర్తం ఎప్పుడు, ఎవరి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అనేది మరికొన్నిరోజుల్లో తెలుస్తుంది.

తెలంగాణ ఎన్నికల హడావిడి మొదలైనా ఇప్పటి వరకూ విజయశాంతి బయటకు రాలేదు. మోదీ, అమిత్ షా సభలకు డుమ్మా కొట్టిన ఆమె.. ప్రచారానికి కూడా దూరంగానే ఉన్నారు. ఆమె టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారో లేదో తెలియదు కానీ, అధిష్టానం కూడా ఆమెతో చర్చించి టికెట్ ఇచ్చే ఆలోచన చేయలేదు. అసెంబ్లీ బరిలో లేని విజయశాంతికి ఆ తర్వాత స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో కూడా చోటు దక్కలేదు. ఇన్ని అవమానాల తర్వాత కూడా ఆమె బీజేపీలో ఉంటారని అనుకోలేం. కొన్నిరోజులుగా ట్విట్టర్లో నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నా.. కాంగ్రెస్ లో చేరతానని మాత్రం ఆమె ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు ఆ టైమ్ వచ్చినట్టు తెలుస్తోంది. విజయశాంతి కాంగ్రెస్ చేరిక దాదాపు ఖాయమైందని అనుకోవాలి.

సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే విజయశాంతి బీజేపీకి మద్దతు ప్రకటించారు. 1996లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీకి స్టార్‌ క్యాంపెయినర్‌ గా మారారు. 1998లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో తన ప్రస్థానం ప్రారంభించారు. 2009లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి, ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్ లో ఆ పార్టీని విలీనం చేశారు. 2009లో మెదక్‌ ఎంపీగా గెలిచి, 2014లో కాంగ్రెస్‌ లో చేరారు. ఆ తర్వాత బీజేపీ, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్.. ఇలా కొనసాగుతోంది ఆమె ప్రస్థానం. తాజా చేరికపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

First Published:  11 Nov 2023 11:19 AM GMT
Next Story