Telugu Global
Telangana

ఇటు తుమ్మ‌ల, అటు ష‌ర్మిల‌, మ‌ధ్య‌లో పొంగులేటి.. పాలేరుపై ఎందుకంత‌ మోజు?

ముగ్గురు పెద్ద నాయ‌కులు త‌మ‌కు అంటే త‌మ‌కు అని ప‌ట్టుబ‌ట్టేంత‌గా పాలేరులో ఏముంది..? అంటే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంస్థాగ‌త బ‌ల‌మే.

ఇటు తుమ్మ‌ల, అటు ష‌ర్మిల‌, మ‌ధ్య‌లో పొంగులేటి.. పాలేరుపై ఎందుకంత‌ మోజు?
X

ఖ‌మ్మం జిల్లా పాలేరు ఇప్పుడు తెలంగాణ‌లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ఆస‌క్తి రేపుతున్న నియోజ‌క‌వ‌ర్గం. అక్క‌డి నుంచి బీఆర్ఎస్‌ టికెట్ ఆశించిన సీనియ‌ర్ నేత తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు టికెట్ ద‌క్క‌లేదు. ఆ టికెట్‌ను గ‌తంలో కాంగ్రెస్‌లో గెలిచి, బీఆర్ఎస్‌లోకి వ‌చ్చిన ఉపేంద‌ర్‌రెడ్డికే అధికార పార్టీ కేటాయించింది. దీంతో తుమ్మ‌ల అల‌క‌బూనారు. కారు దిగి హ‌స్తం పార్టీలోకి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్న వైటీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల కూడా పాలేరు కోస‌మే పోటీపడుతున్న‌రు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి కూడా పాలేరులో బ‌రిలోకి దిగాల‌ని ఆస‌క్తి చూపుతున్నారు.

కాంగ్రెస్‌కు బ‌లం ఉంద‌ని అంచ‌నాలు

ముగ్గురు పెద్ద నాయ‌కులు త‌మ‌కు అంటే త‌మ‌కు అని ప‌ట్టుబ‌ట్టేంత‌గా పాలేరులో ఏముంది..? అంటే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంస్థాగ‌త బ‌ల‌మే. రెండు ఉప ఎన్నిక‌లు స‌హా మొత్తం 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగిన పాలేరులో 11 సార్లు కాంగ్రెస్సే గెలిచింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఖ‌మ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ‌లోనే కీల‌క నేత‌ల్లో ఒక‌డిగా పేరొందిన తుమ్మ‌ల కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉపేంద‌ర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. పైగా అధికార పార్టీ అభ్య‌ర్థి అయినా ఓట‌మి త‌ప్ప‌లేదు. అంటే ఇక్క‌డ కాంగ్రెస్‌కు ఎంత బ‌లం ఉందో చూడొచ్చ‌నేది కాంగ్రెస్ నేత‌ల విశ్లేష‌ణ‌. దానికి త‌గ్గ‌ట్లుగా త‌మ సొంత ఇమేజ్ కూడా క‌లిసి సులువుగా గెలవ‌గ‌ల‌మని అటు తుమ్మ‌ల‌, ఇటు ష‌ర్మిల భావిస్తున్నారు. అందుకే పాలేరు టికెట్ కోస‌మే పోటీప‌డుతున్నారు. పొంగులేటి కూడా ఖ‌మ్మం, కొత్త‌గూడెం అన్నీ చూసుకుని చివ‌రికి పాలేరు అయితే సేఫ్ అనుకుని ఇక్క‌డ‌కే వ‌స్తానంటున్నారు.

ఎవ‌రికి ద‌క్కేను?

పాలేరులోనే పోటీ చేయాల‌ని త‌న‌పై అభిమానుల ఒత్తిడి ఉంద‌ని తుమ్మ‌ల ప‌దేప‌దే చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క వంటి పార్టీ కీల‌క‌నేత‌లంతా వ‌చ్చి త‌న‌ను ఆహ్వానించినా కాంగ్రెస్‌లో చేర‌తానని తుమ్మ‌ల బ‌య‌ట‌ప‌డ‌క‌పోవ‌డానికి కార‌ణం టికెట్ మీద హామీ వ‌చ్చేదాకా ఆగాల‌న్న వ్యూహ‌మే అంటున్నారు. మరోవైపు ష‌ర్మిల క‌ర్ణాట‌క కాంగ్రెస్ కింగ్‌పిన్ డీకే శివ‌కుమార్ ద్వారా దౌత్యం న‌డిపి టికెట్ కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో పాలేరు టికెట్ ఎవ‌రి ప‌ర‌మ‌వుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

*

First Published:  4 Sep 2023 6:07 AM GMT
Next Story