Telugu Global
Telangana

త్వరలో టీఎస్-రోబోటిక్స్‌ను ప్రారంభించనున్న తెలంగాణ ప్రభుత్వం

అంతర్జాతీయ స్థాయి రోబోటిక్స్ డిజైన్, టెస్టింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ నెలకొల్పేందుకు వీలుగా తెలంగాణ స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ (టీఎస్‌ఆర్ఎఫ్)ను త్వరలోనే ప్రకటించనున్నది.

త్వరలో టీఎస్-రోబోటిక్స్‌ను ప్రారంభించనున్న తెలంగాణ ప్రభుత్వం
X

టెక్నాలజీ రంగంలో దూసుకొని పోతున్న తెలంగాణ రాష్ట్రం మరో ఇన్నోవేటీవ్ హబ్ నెలకొల్పడానికి కసరత్తు చేస్తోంది. ఎన్నో అంతర్జాతీయ స్థాయి సంస్థలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్.. ఇకపై రోబోటిక్స్ హబ్‌గా కూడా మారనున్నది. రోబోటిక్స్ రంగంలో మరిన్ని పరిశోధనలు జరగడానికి ఒక వేదికను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పటికే అనేక రంగాలకు ప్రత్యేక పాలసీలు తీసుకొని వచ్చిన ప్రభుత్వం.. తాజాగా రోబోటిక్స్‌కు సంబంధించిన ప్రకటన కూడా చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ స్థాయి రోబోటిక్స్ డిజైన్, టెస్టింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ నెలకొల్పేందుకు వీలుగా తెలంగాణ స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ (టీఎస్‌ఆర్ఎఫ్)ను త్వరలోనే ప్రకటించనున్నది. రాష్ట్రంలో రోబోటిక్స్ ఇండస్ట్రీ అభివృద్ధికి దోహదపడేలా ఈ రోబోటిక్ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడనున్నదని.. రోబోటిక్స్ రంగంలో ఇదొక ముందడుగు అని ఎమర్జింగ్ టెక్సాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి తెలిపారు. రోబోటిక్స్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు చేసుందుకు టీఎస్ఆర్ఎఫ్ ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు.

రోబోటిక్స్ రంగంలో స్టార్టప్స్, చిన్న పరిశ్రమలకు చేయూత నివ్వడానికే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే స్టేట్ ఇన్నొవేషన్ పాలసీ, ఐసీటీ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీల ద్వారా పలు సంస్థలకు ఇన్సెంటీవ్స్ అందిస్తోంది. ఇకపై రోబోటిక్స్ పాలసీ ద్వారా కూడా ఆ రంగంలోని స్టార్టప్స్, చిన్న పరిశ్రమలకు మద్దతు ఇవ్వనున్నది. తెలంగాణ రోబోటిక్స్ ఇన్నొవేషన్ సెంటర్ (ట్రిక్) పేరుతో ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పనున్నది. ప్రస్తుతం టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టీఎస్ ఇన్నోవేషన్ సెల్ వంటివి ఎలా పని చేస్తున్నాయో.. రాబోయే రోజుల్లో టీ-రోబోటిక్స్ (ట్రిక్స్) కూడా అలాగే పని చేస్తుందని అధికారులు చెప్పారు.

ఇప్పటికే ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, సైబర్ సెక్యూరిటీ, ఈ-వేస్ట్ రంగ సంస్థలతో కలిసి టీ-రోబోటిక్స్ పని చేయనున్నది. ఆయా సంస్థలతో కలసి కొత్త అవకాశాలు, ఉద్యోగాలు సృష్టిస్తుందని అధికారులు చెప్పారు. రోబో పార్క్‌ను నెలకొల్పడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక్కడ రోబోటిక్స్‌కి సంబంధించిన టెస్టింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి.

First Published:  5 May 2023 2:58 AM GMT
Next Story