Telugu Global
Telangana

ఓబీసీ జాబితా ఎప్పుడు సిద్ధమయ్యేనో..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 2వేలకుపైగా వెనుకబడిన కులాలకు 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఈ రిజర్వేషన్ల అమలుపై అనేక అనుమానాలున్నాయి.

ఓబీసీ జాబితా ఎప్పుడు సిద్ధమయ్యేనో..?
X

ఓబీసీ జాబితా ఎప్పుడు సిద్ధమయ్యేనో..?

కేంద్ర ఓబీసీ జాబితాలో తెలంగాణకు చెందిన 40 బీసీ కులాలను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. సాధారణ జనాభా గణనతోపాటు వెనుకబడిన తరగతుల కులాల వారీగా జనాభా గణన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం చాలాకాలంగా కోరుతోంది. ప్రస్తుతం కేంద్ర ఓబీసీ జాబితాలో తెలంగాణ నుంచి 87 కులాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 40 కులాలను చేర్చాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవటం వల్ల చాలా సామాజిక వర్గాల్లోని పేదలు విద్య, ఉద్యోగ పరంగా రిజర్వేషన్ల ఫలాలు కోల్పోతున్నారని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు రాష్ట్రాలకు, అటు కేంద్రానికి ఓబీసీల జాబితా కీలకంగా మారింది. చాలా రాష్ట్రాల్లో దాదాపు జనాభాలో సగం ఓబీసీలుంటారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం పంపిన సిఫారసులపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది.

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర జాబితాలో కులాలను చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ, కులాలను OBCల జాతీయ జాబితాలో చేర్చడానికి ఆయా రాష్ట్రాలు సిఫార్సులను కేంద్రానికి పంపాలి. రాష్ట్రాలు పంపిన సిఫారసుల ఆధారంగా ఆయా కులాల సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుపై కమిషన్‌ అధ్యయనం చేస్తుంది. ప్రజాభిప్రాయాన్ని కోరుతుంది. సిఫార్సులను భారత సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖకు పంపుతుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 2వేలకుపైగా వెనుకబడిన కులాలకు 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఈ రిజర్వేషన్ల అమలుపై అనేక అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేసేందుకు కేంద్రం 2017లో జస్టిస్ రోహిణి కమిషన్‌ను నియమించింది. కమిషన్‌ కాల పరిమితిని ప్రభుత్వం ఇప్పటికే 14 సార్లు పొడిగించింది. అయినా ఇప్పటి వరకు కమిషన్‌ నివేదికను సమర్పించలేదు. ప్రస్తుతం కేంద్ర ఓబీసీ జాబితాలో మరిన్ని కులాలను చేర్చాలనే నిర్ణయం ఇప్పుడు జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికతో ముడిపడి ఉంది. రోహిణి కమిషన్‌ నివేదిక ఆధారంగా మాత్రమే మార్పులు చేర్పులు సాధ్యమవుతాయి. మరి తెలంగాణ ప్రభుత్వ సిఫారసులపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  13 Jun 2023 5:46 AM GMT
Next Story