Telugu Global
Telangana

తెలంగాణ పచ్చని బాటలో అడుగులు వేస్తోంది : మున్సిపల్ మంత్రి కేటీఆర్

దేశంలోనే మొట్టమొదటి సారి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్ హోమ్, గ్రీన్ ఎయిర్‌పోర్టు లాంటివి మనకు ఉండటం గర్వకారణమని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ పచ్చని బాటలో అడుగులు వేస్తోంది : మున్సిపల్ మంత్రి కేటీఆర్
X

తెలంగాణ హరిత హారం ద్వారా రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33 శాతం వరకు పచ్చదనం పెరిగింది. కొత్త సచివాలయ భవనం, టీ-హబ్, టీ-వర్క్స్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కొత్త కలెక్టరేట్ భవనాలు, ఆసుపత్రులు, హెల్త్ కేర్ క్యాంపస్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ టవర్లలో గ్రీనరీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా తెలంగాణ పచ్చని బాటలో నడుస్తోందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఆధ్వర్యంలో మొట్ట మొదటి సారిగా హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

దేశంలోనే మొట్టమొదటి సారి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్ హోమ్, గ్రీన్ ఎయిర్‌పోర్టు లాంటివి మనకు ఉండటం గర్వకారణమని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర సచివాలయం, జిల్లా కలెక్టరేట్లను గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌లోనే నిర్మించామని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌లోనే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఉండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఐఐ-ఐజీబీసీకి పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ చెప్పారు.

భారత దేశపు మొట్టమొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్ హోమ్, గ్రీన్ ఎయిర్ పోర్ట్, గ్రీన్ రైల్వే స్టేషన్, గ్రీన్ ఫ్యాక్టరీ.. ఇవన్నీ ఐజీబీసీ విజయాలు అని పేర్కొన్నారు. సీఐఐ-ఐజీబీసీ హైదరాబాద్‌లో 10.27బిలియన్ చదరపు అడుగుల్లో నిర్మాణం పూర్తి చేసిందని కేటీఆర్ వివరించారు.

సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారంతో తెలంగాణలో గ్రీన్ కవర్ 33 శాతానికి పెరిగిందని చెప్పారు. భవనాలు, క్యాంపస్లు మాత్రమే కాకుండా.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో ఐజీబీసీ ద్వారా గ్రీన్ సిటీస్ రేటింగ్ కూడా పెరుగుతుందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణకు హరితహారం ద్వారా చెట్ల విస్తరణను గణనీయంగా పెంచుకున్నామని.. దీంతో రాష్ట్రంలో మొత్తం పచ్చదనం పెరిగిందని కేటీఆర్ తెలిపారు.

నగరాలే కాకుండా రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో కూడా గ్రీన్ బిల్డింగ్ సూత్రాలను అలవంభించాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ చెప్పారు. గంగదేవిపల్లి స్పూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను గ్రీన్ విలేజెస్‌గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని అన్నారు. దీనికి ఐజీబీసీ సహకారం కావాలని మంత్రి కేటీఆర్ కోరారు. గ్రామీణ విద్యుదీకరణ, పారిశుధ్య సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి, గ్రామాలు పచ్చగా మారడానికి వీలుగా పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.


First Published:  28 July 2023 9:58 AM GMT
Next Story