Telugu Global
Telangana

తెలంగాణలో త్వరలోనే బీసీ సర్వే.. ఎందుకంటే..?

సెప్టెంబర్‌ 25 నుంచి నాలుగు రోజుల పాటు పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ శాఖలు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇంటింటికి తిరిగి ప్రత్యేకంగా ఓటర్ల నుంచి వివరాలు సేకరించనున్నారు.

తెలంగాణలో త్వరలోనే బీసీ సర్వే.. ఎందుకంటే..?
X

చట్టసభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూనే.. బీసీల్లోని వివిధ కులాల రాజకీయ ప్రాతినిథ్యంపై త్వరలోనే సర్వే నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సర్వే ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించనుంది. ఇప్పటివరకూ బీసీలకు స్థానిక సంస్థల్లో స్పష్టమైన రిజర్వేషన్ లేదు. అక్టోబర్‌లో తెలంగాణ స్టేట్‌ బీసీ కమిషన్‌ ఈ సర్వేను నిర్వహించనుంది. ఇందుకోసం పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖల సహాయం తీసుకోనుంది.

సెప్టెంబర్‌ 25 నుంచి నాలుగు రోజుల పాటు పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ శాఖలు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇంటింటికి తిరిగి ప్రత్యేకంగా ఓటర్ల నుంచి వివరాలు సేకరించనున్నారు. ఈ సర్వే డేటాను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్‌-TSTS డెవలప్‌ చేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా అనలైజ్ చేయనున్నారు. తర్వాత రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. సర్వేలో భాగంగా బీసీ జనాభా, గ్రామంలో లేదా మున్సిపాలిటీలో బీసీ ఓటర్ల శాతం, విద్యార్హతలు, ఆర్థిక స్థితి, రాజకీయ ప్రాతినిథ్యంపై ప్రశ్నలు ఉండనున్నాయి.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్న దానిపై బీసీ కమిషన్ అధ్యయనం చేస్తోంది. అయితే ఈ సర్వేకు ముందు బీసీ కమిషన్ సభ్యులు.. బిహార్‌ లాంటి సమస్యలు తలెత్తకుండా తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అనుసరించిన విధానాన్ని అధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలనే దానిపై స్పష్టమైన సిఫార్సులతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామన్నారు.

*

First Published:  22 Sep 2023 9:16 AM GMT
Next Story