Telugu Global
Telangana

తెలంగాణలో మందుబాబులకు కష్టకాలం మొదలు..

రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తం చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకపోతే.. లైసెన్స్‌ లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

తెలంగాణలో మందుబాబులకు కష్టకాలం మొదలు..
X

ఎన్నికలంటే చాలు ముందుగా మందుబాబులు హైరానా పడిపోతారు. ఉచిత మద్యం ఓవైపు ఊరిస్తున్నా.. పోలింగ్ టైమ్ లో మూడు రోజుల పాటు వైన్ షాపులు మూసివేయడం వారికి నిరాశ కలిగించే అంశమే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేటితో వైన్ షాపులకు తాళం పడుతుంది. ఈనెల 30వతేదీ పోలింగ్ పూర్తయిన తర్వాత తిరిగి షాపులకు తాళం తీస్తారు. అంటే మూడు రోజుల్లో 48 గంటల సేపు వైన్ షాపులు మూసే ఉంచుతారు. ఈ మూడు రోజులు మందుబాబులకు కష్టకాలమే. అయితే అభ్యర్థులు పోలింగ్ రోజు పంచేందుకు మద్యం నిల్వ చేసుకుని ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు..

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం పూర్తవుతుంది. ప్రచారంతోపాటు వైన్ షాపులకు కూడా తాళం వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే ఆదేశాలిచ్చింది. పోలింగ్ ముగిసిన తర్వాత, అంటే 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరిగి మద్యం అమ్మకాలు మొదలు పెట్టొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తం చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకపోతే.. లైసెన్స్‌ లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

పొరుగు రాష్ట్రాల సరుకు..

మూడు రోజులు డ్రై డేస్ కావడంతో.. సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం తెలంగాణకు వచ్చే అవకాశముంది. అయితే పోలీసులు ఇప్పటికే చెక్ పోస్ట్ లు పెట్టి అక్రమ మద్యం రవాణా అడ్డుకుంటున్నారు. దీంతో మందుబాబులు ఈ మూడు రోజులు సరిహద్దులు దాటి మద్యం సేవించి వచ్చే అవకాశం కూడా ఉంది. గత ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈసారి కూడా అవి రిపీట్ అవుతాయి.

First Published:  28 Nov 2023 1:58 AM GMT
Next Story