Telugu Global
Telangana

పలుచోట్ల ఘర్షణలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదులు

సూర్యాపేటలోని మఠంపల్లిలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ వ్యక్తిని వ్యతిరేక వర్గం చితకబాదింది. గాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు.

పలుచోట్ల ఘర్షణలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదులు
X

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైనా.. కాసేపటికే అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ, ఖమ్మం, ఇబ్రహీంపట్నంలో చెదురుమదురు ఘటనలు జరిగాయి. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. రాజకీయ నాయకులు తొందరపడి వ్యాఖ్యలు చేయవద్దని, నేతలెవరూ నిబంధనలు అతిక్రమించవద్దని సూచించారు తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్. ఈవీఎం సమస్యలు తలెత్తిన చోట సరిచేస్తున్నామని, పోలింగ్‌ బూత్‌ ను యాప్‌ లొకేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సారి ఓటింగ్‌ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వికాస్ రాజ్.

జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ పాఠశాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు బీఆర్ఎస్ అభ్యర్థి పళ్లా రాజేశ్వర్ రెడ్డి. ఆయన పోలింగ్ స్టేషన్ లోపల ఎక్కువసేపు ఉన్నాడని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. మాటా మాటా పెరిగింది, ఇరువర్గాల మద్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఖమ్మంలోని కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్‌ నాయకులు పార్టీ కండువాలు కప్పుకొని ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు, వారిని అడ్డుకున్నారు. సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో గిరిజనులు పోలింగ్ ని బహిష్కరించారు. ఇబ్రహీం పట్నం ఖానాపూర్ లో విజమేరి పోలింగ్‌ కేంద్రం వద్ద వాగ్వాదంతో మొదలైన గొడవ ఘర్షణకు దారితీసింది. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. సూర్యాపేటలోని మఠంపల్లిలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ వ్యక్తిని వ్యతిరేక వర్గం చితకబాదింది. గాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు.

కాంగ్రెస్ ఫిర్యాదులు..

నిర్మల్‌ లో ఓటు వేసిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మెడలో బీఆర్ఎస్ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి రావడంతో కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అంటున్నారు. ఎమ్మెల్సీ కవితపై కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కి ఓటు వేయాలని ఆమె ఓటర్లను కోరారని, వీడియో ఆధారాలున్నాయని చెబుతున్నారు.


First Published:  30 Nov 2023 4:16 AM GMT
Next Story