Telugu Global
Telangana

తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాదే కాదు.. అంతకు మించి

తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి పరిధి బాగా విస్తరించింది. విశేషం ఏంటంటే.. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఆరు జిల్లాలు అభివృద్ధిలో రాజధానితో పోటీ పడుతున్నాయి. తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి సాధించాయి.

తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాదే కాదు.. అంతకు మించి
X

తెలగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే. అందులోనూ ఆ పరిధి విస్తృతంగా ఉండేది కాదు. హైదరాబాద్ లో ఉండే సౌకర్యాలు దగ్గరగా ఉన్న హయత్ నగర్ లో ఉండేవి కావు. శివారు ప్రాంతాల్లో సమస్యలు తిష్టవేసేవి. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి పరిధి బాగా విస్తరించింది. విశేషం ఏంటంటే.. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఆరు జిల్లాలు అభివృద్ధిలో రాజధానితో పోటీ పడుతున్నాయి. తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి సాధించాయి.

రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, మెదక్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలు 2020-21 తలసరి ఆదాయంలో హైదరాబాద్ తో పోటీ పడ్డాయి. 8వేర్వేరు కేటగిరీల్లో సేకరించిన సమాచారం ప్రకారం ఆయా జిల్లాలు అన్ని విభాగాల్లోనూ హైదరాబాద్ తో సమానంగా పురోగమిస్తున్నాయి.

వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ వంటి జిల్లాలు హైదరాబాద్ కు దూరంగా ఉన్నాయి. తలసరి ఆదాయంలో కూడా హైదరాబాద్ తో పోల్చి చూస్తే కింది స్థాయిలో ఉన్నాయి. ఇక హైదరాబాద్ కి దగ్గరగా ఉన్నా కూడా వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయంలో పోటీ పడలేకపోవడం విశేషం.

టీనేజ్ వివాహాల విషయానికొస్తే.. ఖమ్మం, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఎక్కువమంది యువతులు తక్కువ వయసులోనే వివాహాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లో వారి శాతం పూర్తిగా తక్కువ. బరువు తక్కువగా ఉన్న పిల్లలు, పౌష్టికాహార లోపంతో ఉన్నవారి సంఖ్య ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉంది. మరుగుదొడ్ల సౌకర్యం కూడా రాజధానికి దూరంగా ఉన్న జిల్లాల్లో తక్కువగా ఉంది. విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాల్లో కూడా రాజధానికి దూరంగా ఉన్న జిల్లాలకంటే దగ్గరగా ఉన్న జిల్లాలే మెరుగైన ఫలితాలు చూపిస్తున్నాయి.

రాష్ట్ర అభివృద్ధి అంటే జిల్లాల సగటు అభివృద్ధి అని చెప్పాలి. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి కంటే భిన్నంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది. రాజధానితోపాటు చుట్టుపక్కల ఉన్న ఆరు జిల్లాలు అభివృద్ధిలో పోటీపడటం శుభ పరిణామం.

First Published:  24 July 2023 4:11 AM GMT
Next Story