Telugu Global
Telangana

జనసేనతో టీ-బీజేపీ కటీఫ్‌..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేసింది టీ-బీజేపీ. జనసేన 8 స్థానాల్లో పోటీ చేయగా.. ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు.

జనసేనతో టీ-బీజేపీ కటీఫ్‌..!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై స్పష్టత ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఎవరితోనూ పొత్తులుండవన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని స్పష్టంచేశారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తరుణ్‌ చుగ్‌, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై నేతలకు కిషన్ రెడ్డి, తరుణ్‌ చుగ్ దిశానిర్దేశం చేశారు.

ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేసింది టీ-బీజేపీ. జనసేన 8 స్థానాల్లో పోటీ చేయగా.. ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. జనసేనతో పొత్తువల్ల నష్టపోయామని కిషన్ రెడ్డి కామెంట్స్ చేసినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ వార్తలను కిషన్ రెడ్డి ఖండించారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానానికి మాత్రమే సాధించిన బీజేపీ.. ఇటీవల జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచింది. ఇక ఓటింగ్ శాతం కూడా భారీగా పెంచుకుంది.

ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని 25 శాతానికి పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలుచుకుంది బీజేపీ. ఈసారి నాలుగు స్థానాలతో పాటు మరో 4 స్థానాలు గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది.

First Published:  15 Dec 2023 11:40 AM GMT
Next Story