Telugu Global
Telangana

జీహెచ్ఎంసీకి కలిసొస్తున్న టీడీఆర్ సర్టిఫికేట్ స్కీమ్.. భారీగా తగ్గిన భూసేకరణ వ్యయం

తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో టీడీఆర్ స్కీమ్‌లో భారీగా మార్పులు చేశారు. 2017లో టీడీఆర్ విలువను పెంచారు.

జీహెచ్ఎంసీకి కలిసొస్తున్న టీడీఆర్ సర్టిఫికేట్ స్కీమ్.. భారీగా తగ్గిన భూసేకరణ వ్యయం
X

హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. నగరంలో జనాభాతో పాటు ట్రాఫిక్ భారీగా పెరిగింది. దీంతో కొత్త ఫ్లైవోవర్ల నిర్మాణంతో పాటు లింక్ రోడ్ల ఏర్పాటు, రోడ్ల వెడల్పు వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తోంది. గత ఐదేళ్లలో హైదరాబాద్ నగరంలో చాలా ఫ్లైవోవర్లు, అండర్‌పాస్‌లు, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా చాలా వేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చిన ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) స్కీమ్ కారణం.

టీడీఆర్ స్కీమ్‌ను ఉపయోగించి నగరంలో ఎన్నో భారీ ప్రాజెక్టుల కోసం సులభంగా భూసేకరణ చేయగలిగినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఇప్పటి వరకు 1,923 ప్రాపర్టీలను టీడీఆర్ స్కీమ్ ద్వారా సేకరించినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ సహా కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్లు, సిరిసిల్ల మున్సిపాలిటీలో టీడీపీ స్కీమ్ సత్ఫలితాలను ఇస్తోంది. దీని వల్ల ప్రభుత్వం చేయాల్సిన వ్యయం కూడా తగ్గినట్లు అధికారులు వివరించారు.

టీడీఆర్ సర్టిఫికేట్ స్కీమ్ అంటే ఏంటి?

ఏవైనా భారీ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు అవసరమైన భూసేకరణ కోసం గతంలో ఎల్ఏఆర్ఆర్ చట్టం (రైట్ టూ కంపెన్షేషన్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ యాక్ట్) ప్రకారం నష్టపరిహారం అందించే వారు. అయితే ఈ యాక్ట్ ప్రకారం భూసేకరణ చేయడం వల్ల ప్రభుత్వానికి భారీగా వ్యయం అవుతూ వస్తోంది. దీంతో 1998లో తొలిసారి ఉమ్మడి ఏపీలో టీడీఆర్‌ను ప్రవేశపెట్టారు. కానీ ప్రజల నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు.

2012లో మరోసారి టీడీఆర్ పాలసీని రివైజ్ చేశారు. టీడీఆర్ విలువను 100 శాతం నుంచి 200 శాతానికి పెంచారు. కానీ అప్పుడు కూడా భూయజమానులు పెద్దగా పట్టించుకోలేదు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో టీడీఆర్ స్కీమ్‌లో భారీగా మార్పులు చేశారు. 2017లో టీడీఆర్ విలువను పెంచారు.

గతంలో ఎల్ఏఆర్ఆర్ చట్టం ప్రకారం ఎవరైనా రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనుల కోసం ఆస్తులు కోల్పోతే.. వారికి మార్కెట్ ధర ప్రకారం విలువ చెల్లించడమే కాకుండా.. అదనంగా నష్టపరిహారం కూడా ఇచ్చేవారు. దీని వల్ల అర్బన్ లోకల్ బాడీలకు ఆర్థిక భారం భారీగా పెరిగింది. అయితే టీడీఆర్ వల్ల నష్టపరిహారం లాంటివి ఏవీ ఇవ్వరు. కానీ అదే లోకల్‌బాడీ పరిధిలో మరో చోట అదనంగా నిర్మాణాలు చేపట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. అంటే హైదరాబాద్‌లో భూమి, ఆస్తి కోల్పోయిన వ్యక్తి.. నగరంలోనే మరో చోట భవనాన్ని నిర్మిస్తే.. అదనపు ఫ్లోర్లు నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తారు.

హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణాలు ఊపందుకోవడంతో టీడీఆర్ స్కీమ్ వల్ల భారీగా లాభం చేకూరింది. టీడీఆర్ సర్టిఫికేట్‌ను సొంతానికి వాడుకోవచ్చు. లేదంటే వేరే వాళ్లకు విక్రయించే అవకాశం కూడా ఉంటుంది. అంటే.. భూయజమానికి వేరే చోట స్థలం లేకపోతే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆ సర్టిఫికేట్ అమ్ముకోవచ్చు. దీని వల్ల భూయజమాని, కొనుగోలు చేసిన వ్యక్తి లేదా సంస్థకు కూడా లాభమే. ప్రభుత్వం కూడా అదనపు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఈ స్కీమ్‌కు ఆదరణ పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌ను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది.

2017 టీడీఆర్ పాలసీ ప్రకారం రోడ్డు విస్తరణలో కోల్పోయిన వారికి 400 శాతం, చెరువులు, కుంటల అభివృద్దిలో కోల్పోతే 200 శాతం, వారసత్వ కట్టడాల అభివృద్ధిలో కోల్పోతే 100 శాతం టీడీఆర్ ఇస్తున్నారు. 2022 డిసెంబర్‌లో టీడీఆర్‌ను హెచ్‌డీఎంయే పరిధిలోకి విస్తరించడంతో భారీగా స్పందన వస్తోంది.

జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు 1,923 టీడీఆర్ సర్టిఫికేట్లు జారీ చేసింది. దీని ద్వారా 812 ఎకరాలను కేవలం రూ.9,665 కోట్లకే సేకరించింది. ఎల్ఏఆర్ఆర్ చట్టం ప్రకారం అయితే అదనంగా రూ.4,832 చెల్లించాల్సి వచ్చేదని అధికారులు చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణం కోసం టీడీఆర్ చాలా బాగా ఉపయోగపడిందని అధికారులు వివరించారు.

దుర్గంచెరువు అభివృద్ధి, కేబుల్ బ్రిడ్జ్, శిల్పారామం రోడ్ అండర్ బ్రిడ్జ్, బయోడైవర్సిటీ ఫ్లైవోవర్, బైరామల్‌గూడ అండర్‌పాస్, హైటెక్ సిటీ ఆర్యూబీ వంటివి టీడీఆర్ వల్లే సులభంగా నిర్మించారు. ఇక మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 360 టీడీఆర్‌ల ద్వారా 19,786 చదరపు మీటర్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 55 టీడీఆర్‌ల ద్వారా 46,147 చదరపు మీటర్లు, సిరిసిల్ల మున్సిపాలిటీలో 109 టీడీఆర్‌ల ద్వారా 3.457 చరదపు అడుగులు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 26 టీడీఆర్‌ల ద్వారా 5,991 చదరపు మీటర్ల భూమిని సేకరించారు.

First Published:  19 July 2023 1:19 PM GMT
Next Story