Telugu Global
Telangana

త్యాగానికి షబ్బీర్ అలీ రెడీ.. మరి ప్రతిఫలం ఉంటుందా..?

పార్టీ అధికారంలోకి వస్తుందని నాయకులు ధీమాగా చెబుతున్న వేళ, తనను మాత్రం కేసీఆర్ ఖాతాలో ఖర్చు రాయాలనుకోవడం ఏంటని షబ్బీర్ అలీ కొన్నిరోజులుగా ఆందోళన చెందుతున్నారు.

త్యాగానికి షబ్బీర్ అలీ రెడీ.. మరి ప్రతిఫలం ఉంటుందా..?
X

సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో తూముకుంట నర్సారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరో నియోజకవర్గం కామారెడ్డి టికెట్ మాత్రం అధికారికంగా ఖరారు కాలేదు. షబ్బీర్ అలీ వెనకడుగు వేయడంవల్ల ఫస్ట్ లిస్ట్ లో ఈ నియోజకవర్గం పేరు చేర్చలేదు. ఓడిపోయే నియోజకవర్గంలో తానెందుకు పోటీ చేయాలని షబ్బీర్ అలీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించినట్టు సమాచారం. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఆయన్ను ఎట్టకేలకు ఒప్పించగలిగారు నాయకులు. త్యాగానికి షబ్బీర్ అలీ కూడా రెడీ అయ్యారు. తాను కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.

కేసీఆర్ తో పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలుని కట్టేసినట్టేనని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఆల్రడీ ప్రతిపక్షాల్లో కలవరం మొదలైంది. గజ్వేల్, కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీకి అభ్యర్థులు దొరకడంలేదని, ఎవరో ఒకర్ని అక్కడ పోటీకి పెట్టాలని చూస్తోందని విమర్శించారు. కేసీఆర్ పై పోటీ చేస్తే డిపాజిట్లు రావని, కానీ గొప్ప నాయకుడిపై పోటీ చేశారన్న పేరు, మీడియా హడావిడి మాత్రం మిగులుతుందని చెప్పారు కేటీఆర్. ఈ క్రమంలో గజ్వేల్ లో పోటీకి అభ్యర్థి దొరికినా.. కామారెడ్డి విషయంలో మాత్రం కాంగ్రెస్ లో తీవ్ర తర్జన భర్జనలు జరిగాయి. పార్టీ అధికారంలోకి వస్తుందని నాయకులు ధీమాగా చెబుతున్న వేళ, తనను మాత్రం కేసీఆర్ ఖాతాలో ఖర్చు రాయాలనుకోవడం ఏంటని షబ్బీర్ అలీ కొన్నిరోజులుగా ఆందోళన చెందుతున్నారు. అందరు నాయకులు గెలుపు అవకాశాలున్న స్థానాల్ని ఏరికోరి ఎంపిక చేసుకుని, తనని కామారెడ్డికి పంపించడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దశలో తాను పోటీనుంచే విరమించుకుంటానని కూడా చెప్పారు. కామారెడ్డితోపాటు, ఎల్లారెడ్డి టికెట్ కూడా ఇవ్వాలని మరో ఆఫర్ అధిష్టానం ముందుంచారు. కానీ ఇవేవీ వర్కవుట్ కాలేదు. కామారెడ్డి టికెట్ మాత్రమే షబ్బీర్ అలీకి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన మీడియా ముందుకొచ్చి తన పోటీ ఖాయమని ప్రకటించారు. దమ్ముంటే తనపై గెలవాలంటూ కేసీఆర్ కి సవాల్ విసిరి మేకపోతు గాంభీర్యాన్ని చూపించారు.

త్యాగానికి తగ్గ ఫలితం ఉంటుందా..?

కేసీఆర్ పై పోటీ అంటే.. షబ్బీర్ అలీ ముందుగానే తన సీటు త్యాగం చేసినట్టు చెప్పుకోవాలి. మరి ఈ త్యాగానికి తగ్గ ఫలితం ఆయనకు ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఓడిపోయిన తర్వాత పట్టించుకునేవారెవరూ ఉండరనే విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ అధిష్టానం నుంచి గట్టి హామీ తీసుకున్న తర్వాతే ఆయన కామారెడ్డిపై ప్రకటన చేశారని అంటున్నారు. మొత్తమ్మీద కేసీఆర్ పై పోటీకి రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఖరారు చేసిందన్నమాట.

First Published:  24 Oct 2023 3:44 AM GMT
Next Story