Telugu Global
Telangana

ఈ-కామర్స్ ద్వారా తెలంగాణ పప్పు అమ్మకం.. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో లభ్యం

కేంద్ర ప్రభుత్వం సహకారంతో 'భారత్ దాల్' పేరుతో రాయితీకే ఈ పప్పును అమ్మనున్నది.

ఈ-కామర్స్ ద్వారా తెలంగాణ పప్పు అమ్మకం.. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో లభ్యం
X

తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించబోతోంది. తాజాగా సబ్సిడీపై శనగపప్పును అమ్మాలని నిర్ణయించింది. అయితే ఈ పథకం కేవలం తెలంగాణలోనే మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా సబ్సిడీపై మరో రాష్ట్రంలో పంట ఉత్పత్తులు అమ్మడం ఇదే తొలిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటీవ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా) దేశవ్యాప్తంగా సబ్సిడీపై శనగపప్పును పంపిణీ చేయనున్నది.

కేంద్ర ప్రభుత్వం సహకారంతో 'భారత్ దాల్' పేరుతో రాయితీకే ఈ పప్పును అమ్మనున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో శనగపప్పు ధర రూ.90 ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.60 కే అమ్మనున్నట్లు అధికారులు తెలిపారు. 'భారత్ దాల్' అమ్మకాలను ఆదివారం హెచ్ఐసీసీలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కేంద్ర వినియోగదారుల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో దొరికే భారత్ దాల్.. రేపటి నుంచి దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నది. తెలంగాణ తొలి విడతలో 35 వేల టన్నుల శనగపప్పును పంపిణీ చేయనున్నది. ప్రతీ రాష్ట్రంలోని 10 పట్టణాల్లో తెలంగాణ శనగపప్పు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే భారత్ దాల్ కోసం డిస్ట్రిబ్యూటర్లను కూడా నియమించింది. ముంబై, కలకత్తా, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా భారత్ దాల్ కొనుగోలు చేయవచ్చు.

ప్రతీ మెట్రో నగరంలో 200 ఆటోలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వినియోగదారులు నేరుగా భారత్ దాల్ కొనుగోలు చేయవచ్చు. డీమార్ట్, రిలయన్స్ స్మార్ట్ బజార్‌లో కూడా ఈ పప్పు లభిస్తుందని చెప్పారు. జొమాటో, స్విగ్గీ, బిగ్‌బాస్క్ వంటి ఈ కామర్స్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు. ఇక ఆయా రాష్ట్రాల్లో ఉండే జైళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, దేవాలయాలకు సరఫరా చేయడానికి 30 కేజీల బ్యాగులను అందుబాటులో ఉంచారు. వీళ్లకు కేజి కేవలం రూ.55కే లభించనున్నది.

First Published:  1 Oct 2023 2:29 AM GMT
Next Story