Telugu Global
Telangana

సికింద్రాబాద్ టు విశాఖ.. రైల్వే ట్రాక్ దాటాలంటే కష్టమే

ముంబై-అహ్మదాబాద్‌ మధ్యలో 622 కిలోమీటర్ల మార్గంలో రైల్వే ట్రాక్ కి ఇరువైపులా రూ.245 కోట్ల ఖర్చుతో పశ్చిమ రైల్వే కంచె నిర్మాణ పనులు ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే కూడా త్వరలో ఇదే ప్రణాళిక అమలులో పెట్టాలని చూస్తోంది.

సికింద్రాబాద్ టు విశాఖ.. రైల్వే ట్రాక్ దాటాలంటే కష్టమే
X

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే సికింద్రాబాద్- విశాఖ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తోంది. కొత్తగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో వందేభారత్ కి రూట్ క్లియర్ అయింది. అయితే మిగతా చోట్ల ఉన్న సమస్యలే ఇక్కడ కూడా తలెత్తుతున్నాయి. వందే భారత్ రైలు దూరంగా ఎక్కడో కనిపిస్తుంది, దాన్ని అంచనావేసి పట్టాలు దాటే క్రమంలో రెప్పపాటులో అది దూసుకొస్తుంది. అందుకే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ ప్రెస్ కూడా ఇటీవల ఖమ్మం దగ్గర ఓ ఎద్దుని ఢీకొట్టడంతో ఇంజిన్ ముందు భాగం దెబ్బతిన్నది. గంటలతరబడి దానికి మరమ్మతులు చేసి పంపించారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాక్ కి ఇరువైపులా రక్షణ కంచె నిర్మించబోతున్నారు.

గతంలో వందేభారత్ వెళ్లే ప్రతి రూట్ లోనూ ఏదో ఒక ప్రమాదం జరిగిన ఉదాహరణలున్నాయి. కొత్తగా సికింద్రాబాద్- విశాఖ రూట్ లో కూడా రోజుల వ్యవధిలోనే ప్రమాదం జరిగింది. రేపు తిరుపతికి వెళ్లే రూట్ కూడా ఇలానే ఉంటుంది. పల్లెటూళ్లలో పశువులను తోలుకుని పొలాలకు వెళ్లడం, సాయంత్రం వేళ తిరిగి ఇంటికి తోలుకుని రావడం సహజం. ఇలాంటి సమయాల్లో వందే భారత్ వేగాన్ని అంచనా వేయలేకే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖ మధ్య.. గంటకు 150కిలోమీటర్ల గరిష్ట వేగంతో వందేభారత్ రైలు వెళ్తోంది. ఈ రూట్ లో ప్రమాదాలు అరికట్టేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సికింద్రాబాద్‌-విజయవాడ-విశాఖపట్నం మార్గం రైల్వే ట్రాక్‌ కు ఇరువైపులా రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని దక్షిమ ధ్య రైల్వే భావిస్తోంది.

ముంబై-అహ్మదాబాద్‌ మార్గంలో కూడా గతంలో పశువుల్ని వందేభారత్‌ రైళ్లు ఢీకొట్టాయి. దీంతో 622 కిలోమీటర్ల ఆ మార్గంలో రైల్వే ట్రాక్ కి ఇరువైపులా రూ.245 కోట్ల ఖర్చుతో పశ్చిమ రైల్వే కంచె నిర్మాణ పనులు ప్రారంభించింది. జంతువుల కారణంగా ప్రమాదాలు జరిగే ట్రాక్‌ లు గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే కూడా త్వరలో ఇదే ప్రణాళిక అమలులో పెట్టాలని చూస్తోంది. అంచనాలు రూపొందుతున్నాయి. తుది అనుమతులు రాగానే పనులు మొదలవుతాయి.

First Published:  27 March 2023 2:51 AM GMT
Next Story