Telugu Global
Telangana

బహిరంగ ధూమపానం: రూ.33 కోట్ల జరిమానా

తెలంగాణ లో బహిరంగ ధూమపానం చేసిన వారినుండి 14 ఏళ్ళలో 33 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. 2007-08 నుండి 2020-21 మధ్య కాలంలో (జూన్ 2020 వరకు) 26,16,050 మందికి జరిమానా విధించారు.

బహిరంగ ధూమపానం: రూ.33 కోట్ల జరిమానా
X

2008 నుంచి ఇప్పటి వరకు ఈ పద్నాలుగు సంవత్సరాలలో తెలంగాణలో ధూమపాన నిషేధ చట్టం కింద రూ.33 కోట్ల మొత్తాన్ని జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2008 అక్టోబర్‌ 2న స్మోకింగ్ నిబంధనలను అమలులోకి తీసుకవచ్చింది.

2007-08 నుండి 2020-21 మధ్య కాలంలో (జూన్ 2020 వరకు) 26,16,050 మందికి జరిమానా విధించారు. పొగాకు ఉత్పత్తుల నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను అభినందిస్తూ, స్మోకింగ్ రూమ్‌లను తొలగించాలని ప్రజారోగ్య నిపుణులు, వైద్యులు, నిష్క్రియ ధూమపాన బాధితులు విజ్ఞప్తి చేశారు. దేశాన్ని 100 శాతం పొగ రహితంగా మార్చాలని వారు కోరారు.

వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (VHAI) చీఫ్ ఎగ్జిక్యూటివ్, భావా బి ముఖోపాధ్యాయ మాట్లాడుతూ, "నో స్మోకింగ్ నిబంధనల అమలు, పొగాకు నియంత్రణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను చూపుతుంది. అయితే, కొన్ని బహిరంగ ప్రదేశాల్లో (రెస్టారెంట్‌లు, హోటళ్లు, విమానాశ్రయాలు) ధూమపానాన్ని అనుమతిస్తున్నారు. 100 శాతం పొగ రహిత వాతావరణం కోసం హోటళ్ళు, రెస్టారెంట్లు, విమానాశ్రయాలలో కూడా అన్ని స్మోకింగ్ రూమ్స్ ను రద్దు చేయాలని నేను సిఫార్సు చేస్తున్నాను. వాస్తవానికి ఇక్కడ సెకండ్‌హ్యాండ్ పొగకు గురికావడం వల్ల ప్రజానీకం ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతున్నాయి" అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాధులకు, అకాల మరణాలకు పొగాకు వాడకం ప్రధాన కారణమని ఆమె అన్నారు. భారతదేశంలో పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా ఏటా 13 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. భారతదేశంలో 26 కోట్ల మంది పొగాకు వినియోగదారులు ఉన్నారు. దేశంలో పొగాకు ఉత్పత్తుల వార్షిక ఆర్థిక వ్యయం 2017-18లో రూ. 1,77,341 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది, ఇది GDPలో 1 శాతం.

First Published:  3 Oct 2022 6:29 AM GMT
Next Story