Telugu Global
Telangana

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్లే..!

ప్రస్తుతానికి తెల్ల రేషన్‌ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వాళ్లనే 6 గ్యారంటీల లబ్ధిదారులుగా గుర్తించే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కారు. గ్యారంటీల అమలు కోసం ఈనెల 28 నుంచి వచ్చేనెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్లే..!
X

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఇప్పట్లో మోక్షం ఉన్నట్లుగా కనిపించటం లేదు. కొత్త రేషన్ కార్డుల కోసం ద‌రఖాస్తులు తీసుకుంటే 6 గ్యారంటీల అమలు లేట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తోంది రేవంత్ సర్కారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ముందుగా 6 గ్యారంటీలను అమలపైనే ఫోకస్ పెట్టింది. ఈనెల 28 నుంచి వచ్చేనెల 6 వరకు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు తీసుకోబోతోంది. గ్యారంటీల అమలు పూర్తయిన తర్వాత కొత్త రేషన్‌ కార్డులకు ప్రత్యేకంగా అర్జీలు తీసుకోవాలని చూస్తోంది.

ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. 6 గ్యారంటీల్లో ఐదింటికి వైట్ రేషన్‌ కార్డు కంపల్సరీ. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకానికి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ గృహజ్యోతి పథకానికి, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి, వృద్ధులకు రూ.4వేల పెన్షన్‌ చేయూత పథకానికి, విద్యార్థులకు రూ.5లక్షల యువ వికాసం పథకానికి వైట్ రేషన్‌ కార్డే ప్రామాణికం. మరి కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా ప్రభుత్వం అర్హులను ఎలా గుర్తిస్తుంది..? గ్యారంటీలను ఎలా అమలు చేస్తుందనేదే అందరి ప్రశ్న.

అయితే ప్రస్తుతానికి తెల్ల రేషన్‌ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వాళ్లనే 6 గ్యారంటీల లబ్ధిదారులుగా గుర్తించే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కారు. గ్యారంటీల అమలు కోసం ఈనెల 28 నుంచి వచ్చేనెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. డిసెంబర్‌ 31, జనవరి 1 మినహా మిగతా రోజుల్లో దరఖాస్తులు తీసుకోబోతున్నారు. తెలంగాణలో పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు లేవు. ప్రభుత్వం మారడంతో లక్షలాది కుటుంబాలు కొత్తరేషన్ కార్డుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల ముందు నాటికే కొత్తగా 11లక్షల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. దరఖాస్తులకు ఆహ్వానిస్తే వీటి సంఖ్య మరింత పెరగొచ్చు. ఓవైపు రేషన్‌ కార్డుల కోసం జనం ఎదురుచూస్తున్న తరుణంలో వాటిని హోల్డ్‌లో పెట్టాలన్న సర్కారు నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

First Published:  25 Dec 2023 6:14 AM GMT
Next Story