Telugu Global
Telangana

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని కోర్టు కొట్టేసింది.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ
X

ఓటుకు నోటు కేసులో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఓటుకు నోటు కేసులో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని కోర్టు కొట్టేసింది. దీంతో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై దాఖలైన అవినీతి నిరోధక చట్టం కేసును తొలగించాలని కోరారు. అయితే మంగళవారం దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురి చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో టీడీపీలో కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లి భారీ మొత్తంలో నగదు ఇచ్చి.. ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నించారు.

అయితే అదే సమయంలో ఏసీబీ అధికారులు ఆ ఇంటిపై రైడ్ చేసి రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా భారీగా డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఇటీవలే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


First Published:  3 Oct 2023 11:28 AM GMT
Next Story