Telugu Global
Telangana

ఆగస్ట్ 28న సుప్రీంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు విచారణ

ఆగస్ట్ 28కి విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మరోసారి వాయిదా కోరవద్దని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులకు సూచించింది.

ఆగస్ట్ 28న సుప్రీంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు విచారణ
X

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు విచారణ ఆగస్ట్ 28 కి వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాలతో కేసు విచారణ వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టుకి రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు లేఖ రాశారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకున్న సుప్రీం ఆగస్ట్ 28న విచారణ చేపడతామని తెలిపింది. అయితే మరోసారి ఇలా వాయిదా కోరొద్దని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులకు సూచించింది.

2015లో జరిగిన ఓటుకు నోటు వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. అయితే విచారణ వాయిదా వేయాలంటూ రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకి లేఖ రాశారు. వాయిదా వేయొద్దని, కేసు తీవ్రత దృష్ట్యా వెంటనే విచారణ జరపాలన్నారు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బేలా.ఎం.త్రివేది ధర్మాసనం.. ఆగస్ట్ 28కి వాయిదా వేసింది. మరోసారి వాయిదా కోరవద్దని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులకు సూచించింది ధర్మాసనం.

తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ తో టీడీపీ నేతలు బేరసారాలు సాగించారనేది ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబుకు సంబంధించి ఆడియో టేపులు కూడా వైరల్ అయ్యాయి. సీఫెన్‌ సన్‌ తో మాట్లాడింది చంద్రబాబే అంటూ ఇప్పటికే ఫోరెన్సిక్‌ నివేదిక ధ్రువీకరించింది. ఓటుకు నోటు కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. గతంలో ఈ కేసులో రేవంత్ రెడ్డి జైలుకి వెళ్లొచ్చారు. ఈ కేసు విషయంలో ఆయన సుప్రీంకోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన ధర్మాసనం తాజాగా ఆగస్ట్-28కి కేసు వాయిదా వేసింది.

First Published:  20 July 2023 7:17 AM GMT
Next Story