Telugu Global
Telangana

ఢిల్లీలో రేవంత్ బిజీ.. అగ్ర నేతలతో వరుస భేటీలు

అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో కూడా రేవంత్ భేటీ అయ్యారు. రేపు జరగబోయే ప్రమాణస్వీకార కార్యక్రమానికి వారందర్నీ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

ఢిల్లీలో రేవంత్ బిజీ.. అగ్ర నేతలతో వరుస భేటీలు
X

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రేపు. ఈలోగా ఆయన ఢిల్లీలో బిజీబిజీగా మారిపోయారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి అధినాయకత్వాన్ని స్వయంగా ఆయనే ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తో ఆయన భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించినందుకు వారిద్దరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో కూడా రేవంత్ భేటీ అయ్యారు. రేపు జరగబోయే ప్రమాణస్వీకార కార్యక్రమానికి వారందర్నీ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.


మంత్రివర్గ కూర్పుపై చర్చ..

రేవంత్ సీఎం అవుతున్నారు. మరి డిప్యూటీ సీఎం ఇతర కీలక శాఖలు ఎవరెవరికి ఇవ్వాలి. సీఎం సీటుపై ఆశ పెట్టుకున్న సీనియర్లను ఎలా సంతృప్తి పరచాలి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. సీనియర్లను బుజ్జగిస్తూనే.. పార్టీకోసం కష్టపడినవారికి, మహిళలకు, యువతకు మంత్రివర్గంలో పెద్దపీట వేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో సామాజిక సమీకరణాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవం రోజు మంత్రి వర్గంపై కూడా స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశముంది.


ఈనెల 9న కృతజ్ఞతా సభ..

ఈనెల 7న సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం తర్వాత 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ కృతజ్ఞత సభ నిర్వహించే అవకాశముంది. తమకు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణలో సభ నిర్వహిస్తుందని సమాచారం. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై కృతజ్ఞత సభలో కీలక ప్రకటన చేస్తారని అంటున్నారు.

First Published:  6 Dec 2023 5:47 AM GMT
Next Story