Telugu Global
Telangana

అయ్యో రజినీ.. ఓ చోట తిట్లు.. మరో చోట ప్రశంసలు

ఒకవైపు ఆంధ్రాలో రజినీకాంత్ ప్రసంగంపై ఎడాపెడా విమర్శల వర్షం కురుస్తుండగా.. మరోవైపు తెలంగాణలో మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి

అయ్యో రజినీ.. ఓ చోట తిట్లు.. మరో చోట ప్రశంసలు
X

నిన్న విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు పాలన గురించి, హైదరాబాద్ అభివృద్ధి గురించి చేసిన వ్యాఖ్యలకు తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన వచ్చింది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు టీడీపీని స్వాధీనం చేసుకున్న సమయంలో రజినీకాంత్ చంద్రబాబు పక్షాన నిలిచారని ఆంధ్రాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రజినీకాంత్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

చివరికి రజినీకాంత్ కు జోడీగా పలు సినిమాల్లో నటించిన మంత్రి రోజా కూడా రజినీకాంత్ ను వదల్లేదు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకవైపు ఆంధ్రాలో రజినీకాంత్ ప్రసంగం పై ఎడాపెడా విమర్శల వర్షం కురుస్తుండగా.. మరోవైపు తెలంగాణలో మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి గురించి రజినీకాంత్ పొగడటాన్ని మంత్రి హరీష్ రావు స్వాగతించారు.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న రజినీకాంత్ హైదరాబాద్ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ.. 'ఇటీవల హైదరాబాద్ కు షూటింగ్ కోసం వచ్చా.. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ వైపు వెళ్లా.. దాదాపు 20 ఏళ్ల తర్వాత అటుగా వెళ్ళా.. అక్కడి అభివృద్ధి చూసి నేను ఇండియాలో ఉన్నానా.. లేకపోతే న్యూయార్క్ లో ఉన్నానా.. అనిపించింది' అని వ్యాఖ్యానించారు.

రజినీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇవాళ మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని కాశీపూర్ లో బసవ భవన్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధి పక్క రాష్ట్రాల్లో ఉన్న రజినీకాంత్ కు అర్థం అవుతుంది కానీ.. ఇక్కడ ఉన్న గజినీలకు మాత్రం అర్థం కావట్లేదని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి నిత్యం విమర్శలు చేసే ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా ఆయన విమర్శలు చేశారు.

ఇదిలా ఉంటే..హరీష్ రావు తన ప్రసంగంలో రజినీకాంత్ హైదరాబాద్ నగరం న్యూయార్క్ రేంజ్ లో అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారని ప్రస్తావించారు. అయితే హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు హయాంలోనే జరిగిందని.. హైదరాబాద్ ను హైటెక్ నగరంగా మార్చడంలో ఆయన కృషి ఎంతో ఉందని కూడా రజినీ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను మాత్రం హరీష్ రావు తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. దీనిని బట్టి చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ నాయకులు అంగీకరిస్తున్నట్లేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

First Published:  29 April 2023 3:28 PM GMT
Next Story