Telugu Global
Telangana

బోరున ఏడ్చిన రాజయ్య.. కేసీఆర్‌ బాటలోనే నడుస్తానని ప్రకటన

కార్యకర్తలను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేశారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం ముందు సాగిలపడి బోరున ఏడ్చారు. తమ నేత భావోద్వేగాన్ని చూసి పలువురు అభిమానులు సైతం కంటతడి పెట్టారు.

బోరున ఏడ్చిన రాజయ్య.. కేసీఆర్‌ బాటలోనే నడుస్తానని ప్రకటన
X

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం 115 స్థానాలకు బీఆర్ఎస్‌ అభ్యర్థులను సోమవారం ప్రకటించింది గులాబీ పార్టీ. అయితే ఆ జాబితాలో స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు లేకపోవడంతో ఆయనకు షాక్ తగిలింది. నియోజకవర్గంలో రాజయ్యకు ప్రత్యర్థిగా ఉన్న కడియం శ్రీహరికి ఈసారి టికెట్ ఇచ్చారు కేసీఆర్‌. అయితే సోమవారం హైదరాబాద్‌లోనే ఉన్న రాజయ్య ఇవాళ నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈసారి తనకే టికెట్ వస్తుందని ఎన్నోసార్లు బహిరంగంగానే ధీమా వ్యక్తం చేసిన రాజయ్య.. కార్యకర్తలను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేశారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం ముందు సాగిలపడి బోరున ఏడ్చారు. తమ నేత భావోద్వేగాన్ని చూసి పలువురు అభిమానులు సైతం కంటతడి పెట్టారు. అంబేద్కర్ విగ్రహం దగ్గరే కాసేపు వర్షంలో తడుస్తూనే మౌనదీక్ష చేశారు.

తాను ఎన్నడూ కేసీఆర్ గీసిన గీత దాటలేద‌న్నారు రాజయ్య. మొదటి నుంచి కేసీఆర్‌కు వీర విధేయుడిగానే ఉన్నానని గుర్తు చేసుకున్నారు. టికెట్ ఇవ్వకున్నా కేసీఆర్‌ బాటలోనే నడుస్తానన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా.. రాజీనామా చేసి రమ్మంటే కేసీఆర్ మాట ప్రకారమే టీఆర్‌ఎస్‌లోకి వచ్చానన్నారు. తన స్థాయికి తగ్గట్లుగా పార్టీలో సముచిత స్థానం ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. కార్యకర్తలు సమన్వయం పాటించాలని కోరారు. కేసీఆర్‌ నాయకత్వంలో సైనికుల్లాగా పని చేయాలని పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలతోనే తన బతుకని చెప్పారు.

తనకు డిసెంబర్‌ వరకు సమయం ఉందని, మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తానన్నారు రాజయ్య. అక్టోబర్‌ 16న జరిగే సింహగర్జనను సక్సెస్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో ఉండట‌మే తనకిష్టమంటూ బోరున విలపించారు.

*

First Published:  22 Aug 2023 1:32 PM GMT
Next Story