Telugu Global
Telangana

రాజీ పడని రాజా సింగ్.. బీజేపీకి దూరం

జహీరాబాద్, హైదరాబాద్ స్థానాల్లో రాజాసింగ్ తో ప్రచారం చేయించాలనుకుంటోంది బీజేపీ అధిష్టానం. కానీ ఆయన అలిగారు, పార్టీ కార్యక్రమాలకు రావడంలేదు, ప్రచారానికి కూడా రాబోనని పరోక్షంగా హింటిచ్చేశారు.

రాజీ పడని రాజా సింగ్.. బీజేపీకి దూరం
X

"ఒకప్పుడు బీజేపీ, రాజాసింగ్ ని బహిష్కరించింది. ఇప్పుడు రాజాసింగే బీజేపీని బహిష్కరించినట్టుగా ఉంది." ఆ పార్టీలోని కీలక నేతలు చెబుతున్న మాటలివి. అవును, 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గోషామహల్ సీటు గెలిచి అసెంబ్లీలో ఆ పార్టీకి ఎంట్రీ సాధించిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో బీజేపీకి రెండు అదనపు సీట్లు లభించినా.. రాజాసింగ్ ప్రయారిటీ మాత్రం అలానే ఉంది. కానీ 2023నాటికి పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ మధ్యలోనే రాజాసింగ్ ని పార్టీ బహిష్కరించింది, ఎన్నికల వేళ తిరిగి అక్కున చేర్చుకుంది. అయితే ఎన్నికల తర్వాత మళ్లీ ఆయన ప్రయారిటీ తగ్గించింది. లేజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా అవకాశమివ్వకపోవడంతో రాజాసింగ్ హర్ట్ అయ్యారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలొచ్చినా పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉన్నారు. కనీసం కీలక మీటింగ్ లకు కూడా హాజరు కావడంలేదు, అన్నిటికీ డుమ్మాకొట్టారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల మీటింగ్ కి రాజాసింగ్ హాజరు కాలేదు. ఈ మీటింగ్ కి బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ కూడా హాజరయ్యారు. కానీ, రాజాసింగ్‌ డుమ్మా కొట్టారు. ఒకరకంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్‌ తిరుగుబాటు చేసినట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఫోన్ స్విచాఫ్ చేసి, పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు రాజాసింగ్.

అసెంబ్లీలో బీజేపీ లేజిస్లేటివ్ పార్టీ లీడర్ అవకాశం దక్కకపోవడంతో అలిగిన రాజాసింగ్, లోక్ సభ కు పోటీ చేయాలనుకున్నారు. జహీరాబాద్ లేదా హైదరాబాద్ టికెట్లు ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలెవరికీ బీజేపీ ఆ ఆఫర్ ఇవ్వలేదు. హైదరాబాద్ స్థానం మాధవీలతకు కేటాయించిన సందర్భంలో కూడా రాజాసింగ్ తన అసంతృప్తి బయటపెట్టారు. హైదరాబాద్ లో పోటీ చేసేందుకు మగాళ్లే దొరకలేదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీరా ఇప్పుడు అసలు పార్టీకి అందుబాటులో లేకుండా పోయారు. జహీరాబాద్, హైదరాబాద్ స్థానాల్లో రాజాసింగ్ తో ప్రచారం చేయించాలనుకుంటోంది బీజేపీ అధిష్టానం. కానీ ఆయన అలిగారు, పార్టీ కార్యక్రమాలకు రావడంలేదు, ప్రచారానికి కూడా రాబోనని పరోక్షంగా హింటిచ్చేశారు. ఈ దశలో మరోసారి రాజాసింగ్ పై వేటు పడుతుందేమోననే అనుమానాలు బలపడుతున్నాయి.

First Published:  26 March 2024 7:42 AM GMT
Next Story