Telugu Global
Telangana

టెన్షన్ పడుతున్న పొన్నం ప్రభాకర్.. అసలు సంగతేంటి?

ఇటీవల కరీంనగర్ లోక్‌సభ పరిధిలో జరిగిన పరిణామాలు చివరకు పొన్నం టికెట్‌కు ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నాయి.

టెన్షన్ పడుతున్న పొన్నం ప్రభాకర్.. అసలు సంగతేంటి?
X

కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ కాస్త టెన్షన్‌గా ఉన్నారు. తాను లేవనెత్తిన అంశమే చివరకు తనకు టికెట్ రాకుండా చేస్తుందేమో అనే ఆందోళనలో పడిపోయారు. కాంగ్రెస్‌లో బీసీ నాయకులు అందరినీ ఏకం చేసి కనీసం 34 టికెట్లు అయినా తమ వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేసిన వారిలో పొన్నం ముఖ్యుడు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే బీసీ ఓట్లే కీలకం కాబట్టి.. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం 2 టికెట్లు బీసీలకు కేటాయించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలో స్వయంగా హుస్నాబాద్ సెగ్మెంట్ నుంచి పొన్నం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇటీవల కరీంనగర్ లోక్‌సభ పరిధిలో జరిగిన పరిణామాలు చివరకు పొన్నం టికెట్‌కు ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో వేముల వాడ నుంచి ఆది శ్రీనివాస్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారయ్యింది. బీసీ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్‌కు వేములవాడ టికెట్.. తనకు హుస్నాబాద్ టికెట్ కన్ఫార్మ్ అని పొన్నం ధీమాగా ఉన్నారు. ఇప్పటికే హుస్నాబాద్‌లో ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. అయితే తాజాగా కరీంనగర్ టికెట్ బీసీలకు కేటాయించే విషయంపై అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

బొమ్మకల్ సర్పంచ్ పుర్మల్ల శ్రీనివాస్ ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కరీంనగర్ నుంచి ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ముస్లింల ఓట్లు భారీగా ఉన్నాయి. గత ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్ విజయానికి ముస్లింల ఓట్లే కీలకంగా మారాయి. అయితే పుర్మల్ల శ్రీనివాస్‌కు ముస్లిం, ఇతర మైనార్టీ వర్గాలో పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్ అతనికి బీసీ కోటాలో కరీంనగర్ టికెట్ కేటాయిస్తే.. గంగులకు గట్టి పోటీ ఇవ్వగలడని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది.

లోక్‌సభ పరిధిలో రెండు టికెట్లు బీసీలకు కేటాయించాలని అనుకుంటే.. ఇప్పటికే వేములవాడ కన్ఫార్మ్ కావడంతో.. మిగిలిన హుస్నాబాద్ లేదా కరీంనగర్ బీసీలకు ఇవ్వాలి. అంటే పొన్నం ప్రభాకర్ లేదా పుర్మల్ల శ్రీనివాస్‌లో ఒకరికి మాత్రమే టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మరోవైపు వామపక్షాలతో పొత్తు కుదిరితే హుస్నాబాద్ టికెట్‌ను సీపీఐ కోరుతోంది. అక్కడి నుంచి సీపీఐ టికెట్‌పై చాడా వెంకట్ రెడ్డి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అదే జరిగితే పొన్నం ప్రభాకర్‌కు హుస్నాబాద్ టికెట్ గల్లంతు అవడం ఖాయం. ఇప్పటికే హుస్నాబాద్‌లో గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్న పొన్నం.. చివరి క్షణంలో వేరే నియోజకవర్గానికి వెళ్లే వీలు లేదు. పైగా కరీంనగర్ నుంచి పోటీ చేయాలంటే.. అక్కడ బీసీ నాయకుడు శ్రీనివాస్ టికెట్ కోసం లైన్లో ఉన్నారు.

బీసీలకు టికెట్ల కోసం డిమాండ్ చేసిన పొన్నం ప్రభాకర్‌కు చివరకు అదే తన టికెట్‌కు ఎసరు పెట్టేలా కనపడుతోంది. బీసీలకు కరీంనగర్ ఇచ్చినా, సీపీఐకి హుస్నాబాద్ కేటాయించినా పొన్నం చివరకు అసెంబ్లీ ఎన్నికలకు దూరం కావల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు ఈ విషయమే పొన్నంను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక వేళ సీపీఐకి హుస్నాబాద్ కేటాయించకపోయినా.. ముగ్గురు బీసీలకు కరీంనగర్ పరిధిలో కాంగ్రెస్ టికెట్లు కేటాయింస్తుందా అనేది కూడా అనుమానమే. కొంత మంది సీనియర్లు టికెట్లు త్యాగం చేయక తప్పదని ఇటీవల కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఈ లెక్కన పొన్నం ప్రభాకర్‌కు టికెట్ గల్లంతు అయినా ఆశ్చర్యపోనవసరం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది.

First Published:  11 Oct 2023 5:36 AM GMT
Next Story