Telugu Global
Telangana

తెలంగాణకు మోదీ.. బీజేపీని మించి కాంగ్రెస్ హడావిడి

ప్రధాని పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ కీలక నేతలు కూడా ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశముంది.

తెలంగాణకు మోదీ.. బీజేపీని మించి కాంగ్రెస్ హడావిడి
X

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన అంటే హైదరాబాద్ లో సెటైరిక్ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఓ రేంజ్ లో కనపడేవి. సోషల్ మీడియాలో కూడా కౌంటర్లు భారీగా పడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ కూడా బీజేపీకి శత్రువే అయినా.. మోదీ పర్యటనకోసం ఆ పార్టీ నేతలు చేస్తున్న హడావిడి చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ప్రధాని మోదీకి స్వాగతం పలకబోతున్నారు. ఆదిలాబాద్‌కు వస్తున్న ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క.

తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు దండిగా రావాలంటే మోదీని ప్రసన్నం చేసుకోక తప్పదు. అలాంటి పని చేసేందుకు ఇష్టపడని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోనే ప్రారంభించింది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్పి రాయితీలను కూడా వదిలేసుకుంది. కానీ కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే కేంద్రంతో సానుకూలంగా ఉండేందుకే ప్రయత్నాలు జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఈరోజు ప్రధాని పర్యటనలో సందడి చేయబోతున్నారు.

రెండు రోజుల పర్యటన..

ఈరోజు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో ప్రధాని మోదీ ఆదిలాబాద్ కి వస్తారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పను­లకు వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరిగి ఆయన హెలికాప్టర్‌లో నాందేడ్‌ చేరుకుంటారు. అక్కడినుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్తారు. సాయంత్రానికి తిరిగి హైదరాబాద్‌ చేరుకుని రాత్రికి రాజ్‌ భవన్‌లో బస చేస్తారు మోదీ.

మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చి ఆర్గనైజేషన్‌ (సీఏఆర్‌ఓ)ను జాతికి అంకితం చేస్తారు మోదీ. ఆ తర్వాత సంగారెడ్డి పర్యటనలో పాల్గొంటారు. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ కీలక నేతలు కూడా ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశముంది.

First Published:  4 March 2024 3:17 AM GMT
Next Story