Telugu Global
Telangana

మెల్‌బోర్న్ యూనివర్సిటీతో ఉస్మానియా యూనివర్సిటీ ఒప్పందం

బీఎస్సీ డ్యూయల్ డిగ్రీలో మొదటి రెండేళ్ల కోర్సును ఇండియాలో.. మిగిలిన రెండేళ్ల కోర్సు యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ నుంచి పూర్తి చేయవచ్చని ప్రొఫెసర్ అశోక్ ముత్తుపాండియన్ చెబుతున్నారు.

మెల్‌బోర్న్ యూనివర్సిటీతో ఉస్మానియా యూనివర్సిటీ ఒప్పందం
X

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం వల్ల ఇకపై విద్యార్థులు నాలుగేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవచ్చు. 35 వేర్వేరు సబ్జెక్టుల నుంచి కాంబినేషన్ ఎంచుకొని స్పెషలైజేషన్ చేసే వీలుంటుంది. అంతే కాకుండా ఒక ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కూడా పూర్తి చేయవచ్చు. ఈ నాలుగేళ్ల బీఎస్సీ డిగ్రీ ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఉస్మానియా యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.

బీఎస్సీ డ్యూయల్ డిగ్రీలో మొదటి రెండేళ్ల కోర్సును ఇండియాలో.. మిగిలిన రెండేళ్ల కోర్సు యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ నుంచి పూర్తి చేయవచ్చని ప్రొఫెసర్ అశోక్ ముత్తు పాండియన్ చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం మెల్‌బోర్న్ యూనివర్సిటీకి డిప్యుటీ వైస్ ఛాన్సలర్‌గా పని చేస్తున్నారు. విద్యార్థులు బేసిక్ సైన్స్ సబ్జెక్టులు అయిన మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ కాంబినేషన్‌లో డిగ్రీని పూర్తి చేయవచ్చని ఓయూ కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ నవీన్ మిట్టల్ తెలిపారు. అలాగే విద్యార్థులు ఒక సబ్జెక్ట్ నుంచి మరో సబ్జెక్ట్‌కు మారే సమయంలో బ్రిడ్స్ కోర్సును కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు.

డ్యూయల్ డిగ్రీ అంటే ఏంటి?

ఏవైనా రెండు యూనివర్సిటీలు కలిసి విద్యార్థులకు నాలుగేళ్ల డిగ్రీని అందించడానికి యూజీసీ నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం ఇండియా, విదేశాల్లో ఉన్న రెండు యూనివర్సిటీలు అకడమిక్ కొలాబరేషన్ ద్వారా జాయింట్ డిగ్రీ లేదా డ్యుయల్ డిగ్రీలను అందించే వీలుంది. 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ కోర్సుకు పచ్చ జెండా ఊపారు. అయితే 2016లో నిబంధనలు మరింత సరళతరం చేయడంతో విద్యార్థులు డ్యూయల్ డిగ్రీ వైపు మొగ్గు చూపుతున్నారు.

యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం నాలుగేళ్ల కాలంలో ఏ విద్యార్థికి అయినా రెండు డిగ్రీ సర్టిఫికేట్లు లభించే అవకాశం ఉన్నది. ఉదాహరణకు.. ప్రస్తుతం ఉస్మానియా, మెల్‌బోర్న్ యూనివర్సిటీల డ్యూయల్ డిగ్రీ చదివి.. నాలుగేళ్ల తర్వాత బీఎస్సీ(మ్యాథ్స్), బీఎస్సీ (జువాలజీ) సబ్జెక్టులకు సంబంధించిన డిగ్రీలు పొందవచ్చు. ఇంటర్‌లో ఎంపీసీ చదివిన వారికి జువాలజీ చేయడానికి బ్రిడ్జి కోర్సు, బైసీపీ చదివిన వారికి మ్యాథ్స్ చదవడానికి బ్రిడ్జి కోర్సు అందిస్తారు. అంతే కాకుండా ఈ నాలుగేళ్ల డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత.. ఒక ఏడాది పాటు చదివి పీజీ సర్టిఫికేట్ కూడా పొందవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఈ డ్యూయల్ డిగ్రీ కోర్సుల వైపు మొగ్గు చూపుతుండటంతో.. ఉస్మానియా కూడా మెల్‌బోర్న్ యూనివర్సిటీ సౌజన్యంతో అందిస్తున్నది.

First Published:  25 Feb 2023 9:11 AM GMT
Next Story