Telugu Global
Telangana

కేంద్ర బలగాలు, పొరుగు రాష్ట్రాల సిబ్బంది.. తెలంగాణలో అడుగడుగునా పోలీసులు

ఈసారి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తం 375 కంపెనీల బలగాలు తెలంగాణలో మోహరించబోతున్నాయి. ఇప్పటికే 100 కంపెనీలు వచ్చాయి. ఇంకో 275 కంపెనీలు రాష్ట్రానికి రావాల్సి ఉంది

కేంద్ర బలగాలు, పొరుగు రాష్ట్రాల సిబ్బంది.. తెలంగాణలో అడుగడుగునా పోలీసులు
X

తెలంగాణలో ఈసారి అడుగడుగునా పోలీసులే కనపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసుల హడావిడి ఉండేదే అయినా ఈ దఫా అది మరింత ఎక్కువగా కనపడుతోంది. 2018 ఎన్నికల భద్రతా విధుల్లో 279 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. ఈసారి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తం 375 కంపెనీల బలగాలు తెలంగాణలో మోహరించబోతున్నాయి. ఇప్పటికే 100 కంపెనీలు వచ్చాయి. ఇంకో 275 కంపెనీలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఒక్కో కంపెనీలో సగటున 80 నుంచి 100 మంది వరకు సిబ్బంది ఉంటారు. అంటే కేంద్ర సాయుధ బలగాల నుంచే 30 వేల మందికిపైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు.

ఇతర రాష్ట్రాలనుంచి కూడా..

కేంద్ర బలగాలకు తోడు.. అదనంగా ఇతర రాష్ట్రాలనుంచి కూడా పోలీస్ బలగాలను తెలంగాణకు రప్పిస్తున్నారు. ఎన్నికల తేదీకి 10రోజుల ముందు వీరు తెలంగాణకు వస్తారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరిగి వెళ్లిపోతారు. ఇక కౌంటింగ్ రోజు వరకు స్ట్రాంగ్ రూమ్ లకు రక్షణగా కేంద్రబలగాల్లో కొంతమంది ఇక్కడే ఉంటారు.

నోడల్ ఆఫీసర్ గా స్వాతి లక్రా..

కేంద్ర బలగాల భద్రత విధులకు సంబంధించి రాష్ట్ర నోడల్‌ అధికారి స్వాతి లక్రా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ప్రస్తుతం టీఎస్‌ఎస్పీ(తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌) బెటాలియన్స్‌ అడిషనల్‌ డీజీగా ఉన్నారు. స్థానిక శాంతిభద్రతల పరిస్థితుల ఆధారంగా సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు ఆమె తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు స్థానిక పోలీసులకు సహకారంగా ఉంటాయని చెప్పారామె. వాహన తనిఖీలు, రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌ పోస్టులు, ఇతర కీలక పాయింట్లలో పహారా, పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు, ఓటింగ్‌ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూంల వద్ద కీలకమైన భద్రత విధులు కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు అప్పగిస్తామన్నారు నోడల్ ఆఫీసర్ స్వాతి లక్రా.

First Published:  7 Nov 2023 4:59 AM GMT
Next Story