Telugu Global
Telangana

మావల్ల కాదు.. చేతులెత్తేసిన లోకేష్

ప్రస్తుతానికి తాము పోటీ నుంచి తప్పుకుంటున్నామని మాత్రమే చెప్పారు నారా లోకేష్. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఓటు ఏ పార్టీకి వేయాలనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

మావల్ల కాదు.. చేతులెత్తేసిన లోకేష్
X

తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేస్తుంది, రాజమండ్రి జైలులో ఇదే విషయంలో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబుతో చర్చలు జరిపారు, లిస్ట్ రెడీ అయింది, రేపోమాపో పేర్లు ప్రకటిస్తారు అనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. కానీ చివరకు నారా లోకేష్ చేతులెత్తేశారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయట్లేదని ప్రకటించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తేల్చేశారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పోటీ చేయట్లేదని అధికారికంగా ధృవీకరించారు లోకేష్.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలంగాణలో కూడా కొంతమంది హడావిడి చేశారు. నిరసన కార్యక్రమాలంటూ బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలు తీశారు, చివరకు మెట్రో రైళ్లలో కూడా నల్ల చొక్కాలు వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. హైదరాబాద్ లో చంద్రబాబు క్రేజ్ అంటూ రచ్చ చేశారు. హైదరాబాద్ లో సెటిలర్ల ఓట్లను టీడీపీ ప్రభావితం చేయగలదు అనే సీన్ క్రియేట్ చేశారు. అక్కడ సీన్ కట్ చేస్తే, ఇక్కడ లోకేష్ మాత్రం పోటీ మావల్ల కాదు అని తేల్చేయడం విశేషం. కొన్నిరోజుల ముందు తెలంగాణ టీడీపీ వ్యవహారాల పర్యవేక్షణ కోసం బాలకృష్ణ కూడా మీటింగ్ లు పెట్టారు. చివరకు అందరూ తోకముడిచారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

లాభం ఎవరికి..?

తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల లాభం ఎవరికి..? టీడీపీకి పడాల్సిన ఓట్లు ఎవరి ఖాతాలో పడతాయనేదే అసలు ప్రశ్న. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా కూడా ఆయనపై బాబు మనిషి అనే ముద్ర ఉంది. ఆ అభిమానం వర్కవుట్ అయితే.. టీడీపీ ఓట్లు కాంగ్రెస్ కి బదిలీ అవుతాయని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు కూడా చంద్రబాబు విషయంలో సింపతీని చూపించారు. కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలు కూడా టీడీపీ వాళ్లకి ఊరడింపు నిచ్చాయి. ఇక ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో అభ్యర్థుల్ని నిలబెడుతోంది. పోనీ టీడీపీ ఓట్లు తెలంగాణలో జనసేనకు ట్రాన్స్ ఫర్ అవుతాయేమో చూడాలి.

లోకేష్ ప్రకటన ఎలా ఉంటుంది..?

ప్రస్తుతానికి తాము పోటీ నుంచి తప్పుకుంటున్నామని మాత్రమే చెప్పారు నారా లోకేష్. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఓటు ఏ పార్టీకి వేయాలనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ టీడీపీ అధికారికంగా ప్రకటన చేయాల్సి వస్తే కచ్చితంగా మీ ఓటు జనసేనకే వేయండి అని చెప్పాల్సి ఉంటుంది. జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఎవరికి వేయాలనే విషయపై కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రకటనలతో లోకేష్ లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటారా, లేక సైలెంట్ గా ఉంటారా అనేది తేలాల్సి ఉంది.


First Published:  24 Oct 2023 7:15 AM GMT
Next Story