Telugu Global
Telangana

కాంగ్రెస్‌కే నా మద్దతు.. పొంగులేటిని ఓడించాలా? : వైఎస్ షర్మిల

నేను పోటీ చేస్తున్నానని తెలిసి కూడా పొంగులేటి పాలేరు నుంచి నిలబడ్డారు. అలాంటప్పుడు నేనేం చేయాలని షర్మిల ప్రశ్నించారు.

కాంగ్రెస్‌కే నా మద్దతు.. పొంగులేటిని ఓడించాలా? : వైఎస్ షర్మిల
X

వైఎస్ షర్మిల తేల్చేశారు. విలీనం.. పొత్తు.. అంటూ ఇన్నాళ్లూ వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలకు చెప్పుకుంటూ వచ్చిన షర్మిల.. అవి రెండే కాదు.. అసలు పోటీ కూడా లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉన్నారంటూ గత రాత్రి కొంత మంది కార్యకర్తలు లోటస్‌ పాండ్ వద్ద హల్ చల్ సృష్టించారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా వైఎస్ షర్మిల వద్దకు వెళ్లి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో తెలంగాణ ఎన్నికల విషయంలో వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భేషరతు మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

తెలంగాణలో ప్రభుత్వ ఓటు చీలితే అది అంతిమంగా బీఆర్ఎస్, కేసీఆర్‌కు లాభం చేకూరుస్తుంది. అదే జరిగితే చరిత్ర నన్ను క్షమించదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని షర్మిల చెప్పారు. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలనే లక్ష్యంతోనే వైఎస్ఆర్టీపీని ఏర్పాటు చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా 3,600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశాను. అంతకు ముందే 42 మంగళవారాలు నిరసన దీక్షలు చేపట్టాను. ఇందుకు పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో సహకరించారు. అయితే తెలంగాణలో ఉన్న వ్యతిరేక ఓటు చీలితే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.

కేసీఆర్‌ను ఎదుర్కునే ఛాన్స్ కాంగ్రెస్‌కు ఉందని చాలా మంది సూచించారు. వైఎస్ఆర్ పటిష్టం చేసిన కాంగ్రెస్‌ను ఓడించ వద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఆలోచన తనకు లేదు. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ మాత్రమే. అందుకే తెలంగాణ ఎన్నికల్లో వారికి నా మద్దతు ప్రకటిస్తున్నానని అన్నారు.

పాలేరు ప్రజలకు నా క్షమాపణలు..

పాలేరు నుంచి పోటీ చేయాలని గతంలో నిర్ణయించుకున్నాను. ఇప్పటికీ నాకు అక్కడే పోటీ చేయాలని ఉంది. కానీ అనివార్యంగా తప్పుకుంటున్నాను. అందుకే పాలేరు ప్రజలు తనను క్షమించాలని షర్మిల కోరారు. ఏనాటికైనా పాలేరు ప్రజలతో ఓటేయించుకొని గెలుస్తానని ఆమె మాటిచ్చారు.

తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు నా వెంట ప్రతీ రోజు తిరిగిన వ్యక్తి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఒకప్పుడు ఆయన గెలుపు కోసం నేను, అమ్మ విజయలక్ష్మి ప్రచారం చేశాము. నేను పోటీ చేస్తున్నానని తెలిసి కూడా పొంగులేటి పాలేరు నుంచి నిలబడ్డారు. అలాంటప్పుడు నేనేం చేయాలి. పొంగులేటిని ఓడించాలా? ఓటమికి కారణం కావాలా?. అక్కడ కందాల ఉపేందర్ రెడ్డి, పొంగులేటి మధ్య తీవ్రమైన పోటీ జరుగుతోంది. రాష్ట్రమంతా పాలేరు వైపు చూస్తోంది. అందుకే పాలేరు బరిలో కూడా తాను ఉండటం లేదని చెప్పుకొచ్చారు.

First Published:  3 Nov 2023 7:33 AM GMT
Next Story