Telugu Global
Telangana

అన్నదమ్ముల్లా ఉన్నాం.. చిచ్చు పెట్టొద్దు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందల మంది ప్రాణత్యాగం చేశారని, లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేశారని.. వారి త్యాగాన్ని తక్కువ చేసే విధంగా ప్రధాని మోదీ మాట్లాడటం సరికాదన్నారు ఎంపీ సురేష్ రెడ్డి.

అన్నదమ్ముల్లా ఉన్నాం.. చిచ్చు పెట్టొద్దు
X

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలి రోజునే తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ విషం చిమ్మారని ఇదెక్కడి న్యాయం అని మండిపడ్డారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి. ప్రధాని తన హోదాకు తగ్గట్టు మాట్లాడలేదన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని.. తమ మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడొద్దని హితవు పలికారు. రాష్ట్ర విభజన గురించి మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం తెలిపారు. మోదీ వ్యాఖ్యలపై సురేష్ రెడ్డి రాజ్యసభలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

మీరు సరిచేయొచ్చు కదా..?

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందల మంది ప్రాణత్యాగం చేశారని, లక్షలాదిమంది రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేశారని.. వారి త్యాగాన్ని తక్కువ చేసే విధంగా ప్రధాని మోదీ మాట్లాడటం సరికాదన్నారు ఎంపీ సురేష్ రెడ్డి. ఏపీ, తెలంగాణను సైంటిఫిక్‌ గా విభజించలేదని పదేపదే మాట్లాడడం సరికాదన్నారు. ఒకవేళ సైంటిఫిక్‌ గా విభజన జరగలేదని మోదీ అనుకుంటే.. ప్రధానిగా 9 ఏళ్ల పాలనలో దాన్ని సరిచేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలన్నారు. ఎలాంటి సవరణలు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం చేశారు..?

తొమ్మిదేళ్లలో తెలంగాణకు సంబంధించిన ఏ సమస్యను ప్రధాని మోదీ పరిష్కరించారో చెప్పాలన్నారు ఎంపీ సురేష్ రెడ్డి. నీటి వివాదాలు, నీటి కేటాయింపులు చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులేమైనా చేశారా అని అడిగారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అందరం కలిసే ఉంటున్నామన్నారు. ఇలాంటి మంచి వాతావరణాన్ని రాజకీయ లాభాల కోసం చెడగొట్టొద్దని హితవు పలికారు.

First Published:  21 Sep 2023 12:55 AM GMT
Next Story