Telugu Global
Telangana

బోధన్ లో రక్తపాతం.. కవిత ఆగ్రహం

ఎమ్మెల్యే షకీల్ వర్గంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు.

బోధన్ లో రక్తపాతం.. కవిత ఆగ్రహం
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎనిమిది రోజులే టైమ్ ఉంది. మైకులు మూగబోడానికి వారం రోజులే గడువుంది. ఈ దశలో మాటలు తూటాలవుతున్నాయి. చేతలు శృతి మించుతున్నాయి. చాలా ప్రాంతాల్లో దాడులు, ప్రతి దాడులు, రక్తపాతాలు సహజంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు, వారి అనుచరులు దాడులకు పాల్పడుతున్నట్టు పలు ఉదాహరణలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా బోధన్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్, ఆయన అనుచరులపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ కార్యకర్తల తలలు పగిలాయి. రక్తగాయాలతో కొంతమంది ఆస్పత్రిలో చేరారు. ఎమ్మెల్సీ కవిత ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది..?

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం అంబంలో ఈ దాడి జరిగింది. ఎమ్మెల్యే షకీల్‌ అంబం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కి చెందిన ఓ నాయకుడి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు కూడా వారితో జతకలసి బీఆర్ఎస్ వారిపై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.


కవిత ఆగ్రహం..

ఎమ్మెల్యే షకీల్ వర్గంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటమి ఖాయమైందని, బీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలువబోతుందని తెలిసి దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. 60 లక్షల గులాబీ సైన్యం ముందు మీరెంత..? అని ప్రశ్నించారామె. సత్తా కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. ప్రజా క్షేత్రంలో ధీటుగా బదులు చెప్తారన్నారు. దాడులకు తెగబడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు కవిత. దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


First Published:  22 Nov 2023 10:17 AM GMT
Next Story