Telugu Global
Telangana

కాంగ్రెస్ వి బాండ్ పేపర్ల డ్రామాలు

అప్పట్లో సంక్షేమ హాస్టళ్లు కేవలం 293 కాగా, ఇప్పుడు హాస్టళ్లు అదనంగా 1022 వచ్చాయని అది బీఆర్ఎస్ ఘనత అని చెప్పారు కవిత. కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని, వారి మాటలు నమ్మితే ఐదేళ్లు ప్రజలు కన్నీరు పెట్టాల్సి వస్తుందన్నారు.

కాంగ్రెస్ వి బాండ్ పేపర్ల డ్రామాలు
X

బాండ్ పేపర్లతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె.. కాంగ్రెస్ డ్రామాలు చూసి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నాటకలో ఎన్నికల రోజు ఇలాగే మోసపు ప్రకటనలు ఇచ్చారని. అగ్రనేతలంతా సంతకాలు చేసి మాయ చేశారని, అక్కడ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ప్రజలకు మేలు జరగలేదన్నారు కవిత. ఇక్కడ కూడా అలాంటి మోసం చేయడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారని కౌంటర్ ఇచ్చారు.


55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి కంటే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన మేలు అధికం అని చెప్పారు కవిత. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతంలో మొత్తం 41 రిజర్వాయర్లు కట్టారని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 157 రిజర్వాయర్లు కట్టామని వివరించారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో వేసిన రోడ్ల మొత్తం పొడవు కేవలం 6,700 కిలోమీటర్లు అని.. బీఆర్ఎస్ పాలనలో 13వేల కిలోమీటర్ల రోడ్లు వేసుకున్నామని చెప్పారు.

కాంగ్రెస్ 55 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు తెస్తే.. బీఆర్ఎస్ పదేళ్లలో 34 కొత్త కాలేజీలు తెచ్చిందని గుర్తు చేశారు. అప్పట్లో సంక్షేమ హాస్టళ్లు కేవలం 293 కాగా, ఇప్పుడు హాస్టళ్లు అదనంగా 1022 వచ్చాయని అది బీఆర్ఎస్ ఘనత అని చెప్పారు కవిత. కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని, వారి మాటలు నమ్మితే ఐదేళ్లు ప్రజలు కన్నీరు పెట్టాల్సి వస్తుందన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఉద్యోగాల విషయంలో యువతను మోసం చేస్తోందని మండిపడ్డారు కవిత. కేంద్రంలో 13 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు కవిత. తెలంగాణకు వచ్చి యువతతో సమావేశాలు నిర్వహించి రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. సౌభాగ్య లక్ష్మి అమలు చేస్తామని చెప్పారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు కవిత.

First Published:  28 Nov 2023 6:05 AM GMT
Next Story