Telugu Global
Telangana

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు లాస్ట్ డేట్ అదే - పొన్నం

ప్రజాపాలనలో ఇప్పటివరకు 40 లక్షలకు పైగా దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. పింఛన్లు, రైతుబంధు ఇప్పటికే పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది.

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు లాస్ట్ డేట్ అదే - పొన్నం
X

ఆరు గ్యారెంటీ పథకాల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీక‌రించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ఎలాంటి పొడిగింపు ఉండదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. అర్హులంతా ఈ నెల 6 లోపే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజా పాలన అప్లికేషన్లపై రాజకీయాలు తగదని ప్రతిపక్షాలకు సూచించారు.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరంపై బీజేపీ ఎందుకు సీబీఐ ఎంక్వైరీ చేయట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. MIM, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు పొన్నం. చాలా కేసుల్లో కేసీఆర్ ఫ్యామిలీని బీజేపీ రక్షించిందన్నారు.

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసే క్రమంలో ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 28న ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. డిసెంబర్‌ 31న ఆదివారం, జనవరి 1న దరఖాస్తుల స్వీకరణకు అధికారులు విరామం ప్రకటించారు. ఇవాల్టి నుంచి మళ్లీ దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది.

ప్రజాపాలనలో ఇప్పటివరకు 40 లక్షలకు పైగా దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. పింఛన్లు, రైతుబంధు ఇప్పటికే పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది. కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తులకు మరో 4 రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే ఈ నెల 6 వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. దరఖాస్తుల సంఖ్య దాదాపు కోటి దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

First Published:  2 Jan 2024 12:52 PM GMT
Next Story