Telugu Global
Telangana

తప్పు నాది కాదు ఆర్డీఓది.. మంత్రి పొన్నం రివర్స్ గేమ్

ఫోన్ కాల్ రికార్డ్ చేసింది ఆర్డీఓ అని, దాన్ని ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పంపించారని ఆరోపిస్తున్నారు మంత్రి పొన్నం.

తప్పు నాది కాదు ఆర్డీఓది.. మంత్రి పొన్నం రివర్స్ గేమ్
X

కల్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ కాల్ రికార్డింగ్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్ కాల్ వ్యవహారం అధికార కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది. అధికారులకు మంత్రి వార్నింగ్ ఇవ్వడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అని నిలదీస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కవరింగ్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన ఫోన్ కాల్ రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారంటూ ఆయన హన్మకొండ ఆర్డీఓపై సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదు చేశారు. ఆర్డీఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

తప్పెవరిది..?

మంత్రి పొన్నం ప్రభాకర్ ముందుగా ఆర్డీఓకి ఫోన్ చేశారు, ఆ తర్వాత వారిద్దరూ మహిళా ఎమ్మార్వోతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారు. ఈ కాల్ రికార్డ్ తర్వాత బయటకొచ్చింది. అయితే ఆ ఫోన్ కాల్ రికార్డ్ చేసింది ఆర్డీఓ అని, దాన్ని ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పంపించారని ఆరోపిస్తున్నారు మంత్రి పొన్నం. అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ కి ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో బెదిరించినట్టు మాట్లాడటంపై మంత్రి వివరణ ఇవ్వడంలేదు కానీ, తన ఫోన్ కాల్ రికార్డ్ చేశారంటూ ఆర్డీఓపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇక్కడ విశేషం.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అధికార కార్యక్రమాలకు పిలవకపోవడం, ప్రొటోకాల్ అమలు చేయకపోవడం, పిలిచినా వారిని అవమానించడం.. అధికారంలో ఉన్నవారు చేసే పనే. ఈ క్రమంలో అధికారులపై ఒత్తిడి తేవడం, ఒక్క చెక్కు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే చేతికి వెళ్లకూడదని అధికారులకు హుకుం జారీ చేయడంలో ఇక్కడ కాంగ్రెస్ మార్క్ రాజకీయం కనపడుతోంది.

First Published:  20 March 2024 10:56 AM GMT
Next Story