Telugu Global
Telangana

తెలంగాణ కరువు సీమలన్నీ ఇప్పుడు కోనసీమలు..

గతంలో పాలమూరుకి వలస జిల్లా అనే పేరుందని, కంటే కాన్పు కోసం, లేదా చస్తే బొంద కోసమే వలసపోయినవాళ్లు సొంత ఊళ్లకి తిరిగి వచ్చేవారని, కానీ ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ కనపడుతోందన్నారు మంత్రి కేటీఆర్.

తెలంగాణ కరువు సీమలన్నీ ఇప్పుడు కోనసీమలు..
X

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కరువు సీమలన్నీ కోనసీమలుగా మారాయని అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ అభివృద్ధిని అసెంబ్లీలో సాధికారికంగా ఉదాహరణలతో సహా వివరించారాయన. బలగం సినిమా ప్రస్తావన తీసుకొచ్చిన మంత్రి కేటీఆర్.. ఆ సినిమా షూటింగ్ అంతా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంలో జరిగిందని, తెలంగాణ పల్లెటూరి అందాలన్నీ అందులో చూపించారన్నారు. ఆ సినిమా చూసిన వారు ఇలాంటి గ్రామాలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నాయా అని అడిగారని, అభివృద్ధి ఆ స్థాయిలో జరిగిందని చెప్పారు. ఒకప్పుడు తెలంగాణలో కరువు సీమలుగా ఉండే గ్రామాలు, కోనసీమ గ్రామాల్లా పచ్చగా ఉన్నాయని అన్నారు కేటీఆర్.


రివర్స్ మైగ్రేషన్..

బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధితో తెలంగాణ పల్లెల్లో రివర్స్ మైగ్రేషన్ మొదలైందన్నారు మంత్రి కేటీఆర్. గతంలో పాలమూరుకి వలస జిల్లా అనే పేరుందని, కంటే కాన్పు కోసం, లేదా చస్తే బొంద కోసమే వలసపోయిన వాళ్లు సొంత ఊళ్లకి తిరిగి వచ్చేవారని, కానీ ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ కనపడుతోందన్నారు. హైదరాబాద్ తోపాటు పలుచోట్ల ఐటీ హబ్ లు ఏర్పాటు చేసి, యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు సృష్టించామన్నారు మంత్రి కేటీఆర్.

మిషన్ కాకతీయ ద్వారా 28వేల చెరువులను అభివృద్ధి చేశామని, కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి మాత్రం ఆగలేదన్నారు మంత్రి కేటీఆర్. ఏడాదికి 12వేల కోట్ల రూపాయలు ఉచిత కరెంటు కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. పల్లె ప్రగతి సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్నారు. గల్లీలో బీజేపీ నేతలు తమ ప్రభుత్వాన్ని తిడతారని, కానీ ఢిల్లీలో మాత్రం అవార్డులు ఇస్తారని చెప్పారు. తెలంగాణ పల్లెలు 35 శాతం అవార్డులు గెలుచుకున్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వల్లే తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా ఎకరం 25 లక్షల రూపాయలు పలుకుతోందన్నారు. కట్టడం మాత్రమే తమకు తెలుసని, గ్రామాల్లో లక్షల కోట్ల సంపద సృష్టించామని, ఇది బీఆర్ఎస్ ఘనత అని చెప్పారు మంత్రి కేటీఆర్. పెరుగుతున్న జనాభా అవసరాలకోసం మెట్రో విస్తరిస్తున్నామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని కార్మికులకు మంచి చేస్తున్నామని చెప్పారు.

First Published:  5 Aug 2023 11:44 AM GMT
Next Story