Telugu Global
Telangana

అర పైసా కూడా ఖర్చు చేయలేని ఎంపీ అవసరమా..?

"ఒక్క న‌వోద‌య పాఠ‌శాల‌ అయినా వ‌చ్చిందా..? క‌స్తూర్బా కాలేజీ వ‌చ్చిందా..? మెడిక‌ల్ కాలేజీ రాదు.. న‌ర్సింగ్ కాలేజీ ఇవ్వ‌రు. మ‌ళ్లీ సిగ్గు లేకుండా డిగ్రీ కాలేజీ ఇవ్వాల‌ని మాట్లాడుతారు." అంటూ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

అర పైసా కూడా ఖర్చు చేయలేని ఎంపీ అవసరమా..?
X

నియోజకవర్గానికి అరపైసా కూడా ఖర్చు చేయలేని ఎంపీ అంటూ బండి సంజయ్ పై సెటైర్లు పేల్చారు మంత్రి కేటీఆర్. తమకంటే ముందున్న ప్ర‌భుత్వాలు ఏం చేశాయని నిలదీశారు. ఒక బ‌డిని బాగు చేద్దామ‌న్న ఆలోచ‌న లేదని, ఇప్పుడొచ్చి పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. "బ‌డిని, గుడిని ప‌ట్టించుకోలేదు, క‌రెంట్, సాగు నీళ్లు ఇవ్వ‌లేదు, ఎంపీ బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్‌ కు అర పైసానైనా సాయం చేసిండా..?" అని ప్రశ్నించారు కేటీఆర్. "ఒక్క న‌వోద‌య పాఠ‌శాల‌ అయినా వ‌చ్చిందా..? క‌స్తూర్బా కాలేజీ వ‌చ్చిందా..? మెడిక‌ల్ కాలేజీ రాదు.. న‌ర్సింగ్ కాలేజీ ఇవ్వ‌రు. మ‌ళ్లీ సిగ్గు లేకుండా డిగ్రీ కాలేజీ ఇవ్వాల‌ని మాట్లాడుతారు." అంటూ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.


ఎవ‌డో ఆందోళ‌న చేసినందుకు కాదు, ఎల్లారెడ్డిపేట ప్ర‌జ‌ల మీద ప్రేమ‌తో కేసీఆర్ డిగ్రీ కాలేజీ మంజూరు చేశారని అన్నారు మంత్రి కేటీఆర్. కార్ల‌కు అడ్డుప‌డటం, ధ‌ర్నాలు చేయ‌డం కాదని, చేత‌నైతే, ద‌మ్ముంటే.. కేంద్రం నుంచి ఓ రెండు కాలేజీలు, రెండు ప‌రిశ్ర‌మ‌లు తీసుకురావాలని సవాల్ విసిరారు. సిరిసిల్ల నేత‌న్న‌ల కోసం ఒక మెగా ప‌వ‌ర్‌ లూమ్ క్ల‌స్ట‌ర్ తీసుకు రావాలన్నారు. క‌రీంన‌గ‌ర్‌ కి ఒక ట్రిపుల్ ఐటీ తీసుకురండి అంటూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు కేటీఆర్.

పలకతో వచ్చి పట్టాతో వెళ్లాలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రూ.8.5 కోట్లతో అభివృద్ది చేసిన విద్యా క్యాంపస్‌ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గంభీరావు పేటలో కేజీ టు పీజీ క్యాంపస్ కి పలకతో వచ్చివారు పట్టాతో తిరిగి వెళ్తారని చెప్పారు మంత్రి కేటీఆర్. అందుకే ఇక్కడ కేజీ టు పీజీ క్యాంపస్ ఏర్పాటు చేశామన్నారు. మూడు దశల్లో 510 ప్రభుత్వ పాఠశాలల్లో 12 మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. రాజ‌న్న సిరిసిల్ల ప‌రిధిలో – 60 పాఠ‌శాలల్లో 22 వేల మంది విద్యార్థులకు కంప్యూటర్ చాంప్స్ పేరుతో బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల‌ను టీ ఫైబ‌ర్‌తో అనుసంధానం చేయబోతున్నట్టు చెప్పారు కేటీఆర్. మంచి చదువు ఉంటే ఎవరి పైరవీలు అవసరం లేదని చెప్పారు. ఒక్కతరం చదువు కుంటే ఆ కుటుంబం ఎప్పటికీ బాగుంటుందని అన్నారు మంత్రి కేటీఆర్.

First Published:  20 Jun 2023 1:24 PM GMT
Next Story